ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » మా నాన్న కేసీఆర్... నా రోల్ మోడల్ కాదు: కవిత (Kavitha | KCR | TRS | KTR | Telangana | separate statehood)
ప్రత్యేక తెలంగాణా వాదం తెరమీదికి వచ్చిన తర్వాత తెలంగాణా రాష్ట్ర సమితిలో ఉన్న ఛోటా మోటా నాయకులందరూ ప్రజలకు బాగా తెలిసిపోయారు. అదలా ఉంచితే తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె కూడా మీడియా ద్వారా ప్రజల ముందుకు వచ్చారు. ప్రత్యేక తెలంగాణాను ఆకాంక్షించే కవితకు సీమాంధ్రలోనే ఎక్కువ మంది స్నేహితులున్నారట.
వైజాగ్, విజయవాడ.. ఇలా సీమాంధ్రలో పలు ప్రాంతాలలో తనకు స్నేహితులున్నారనీ, వారందరితో తన భావాలు పంచుకుంటాననీ చెప్పుకొచ్చారు. తన స్నేహితురాళ్లను ఇటీవల పలుకరిస్తూ... మీరు హైదరాబాదు రావాలంటే వీసా అప్లై చేసుకోవాల్సిందే.. అని నవ్వుతూ అన్నదట. దానికి కవిత స్నేహితురాళ్లు నవ్వుతూ... నువ్వు ఇక్కడకు రావాలంటే నీకు కూడా వీసా కావాలిగా అని ఛలోక్తులు విసిరారట. అలా సరదాగా అప్పుడప్పుడు తాము మాట్లాడుకుంటుంటామని కవిత చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో ప్రవేశించిన మీకు రోల్ మోడల్ ఎవరూ... అని ప్రశ్నిస్తే.. తన తండ్రి కేసీఆర్ పేరు చెప్పకుండా మరో పేరు చెప్పారు. ఆ పేరు కేటీఆర్. తన సోదరుడు కె. తారక రామారావు తెలివి తేటలు అమోఘమనీ, ఎప్పుడూ క్లాసు ఫస్టేననీ, తన సోదరుడిని కనీసం ఒక్కసారైనా బీట్ చేస్తూ మార్కులు తెచ్చుకుందామని ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాలేదని గుర్తు చేసుకున్నారు.
అంతేకాదు రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత కూడా, కేటీఆర్ ఎంతో హుందాగా, ఓర్పుగా ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తుంటారనీ, వాటన్నిటినీ తాను అనుసరించి మంచి మార్కులు కొట్టేయాలని యత్నిస్తుంటానన్నారు. అలా తనకు రోల్ మోడల్‌గా తన సోదరుడే నిలిచారన్నారు.