తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నుంచి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని బహిష్కరించడం వెనుక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు కుట్ర వుందని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణపై ఏకాభిప్రాయం తప్పనిసరని ప్రధాని మన్మోహన్ సింగే చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోని తెరాస కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్, కేసీఆర్‌లు తమను టార్గెట్ చేయడం వారి కుట్రలో భాగమేనన్నారు.
శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఐకాస సమావేశంలో జేఏసీ నుంచి తెదేపాను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. దీనిపై నాగం జనార్ధన్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో స్పందించారు. తెలంగాణ సమస్యకు ఏకాభిప్రాయ సాధన ద్వారానే పరిష్కారం లభిస్తుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలను తెలంగాణ వాదులు ఖండించక పోవడం వారి చిత్తశుద్ధిని శంకించవలసి వస్తోందన్నారు.
లాయర్లపై దాడి వల్లే జెఏసీ నుంచి తెలుగుదేశం పార్టీని బహిష్కరించామని కోదండరామ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ నేతలు లాయర్లపై దాడి ఘటనకు క్షమాపణలు కూడా చెప్పారని గుర్తు చేశారు.
చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్, కోదండరామ్‌లు కలిసి ఆడుతున్న రాజకీయ నాటకంగా నాగం అభివర్ణించారు. అలాగే తనపై దాడి చేసినప్పుడు జెఏసీ నుంచి తాను క్షమాపణ కోరలేదన్న విషయాన్ని నాగం గుర్తు చేశారు.