ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » శభాష్ చిరంజీవి.. ఇలాగే ముందుకు సాగు: నన్నపనేని (Chiru | Nannapaneni | Fee zone | Hyd | Assembly | PRP | TDP)
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని తెలుగుదేశం పార్టీ మహిళా సీనియర్ నేత, ఎమ్మెల్యే నన్నపనేని రాజకుమారి అభినందల వర్షంలో ముంచెత్తారు. ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ సభ కార్యక్రమాలను అడ్డుకోవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి కాకుండా తెలంగాణలోని కొన్ని జిల్లాల ప్రజలకు కూడా హాని కలిగించే ఫ్రీజోన్ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిచడాన్ని ఆమె స్వాగతించారు. ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలపై చిరంజీవి ఇదే తరహాలో తమ అభిప్రాయాలను ముక్కుసూటిగా వ్యక్తం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌ను ఫ్రీజోన్ నుంచి మినహాయిస్తూ.. ఆరోజోన్‌లోనే ఉంచేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14 ఎఫ్ పేరాను సవరించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ ప్రభుత్వం సభలో ఒక తీర్మానం చేసింది. ఇలా చేయడం వల్ల రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కేవలం కొన్ని జిల్లాలకు చెందిన యువతీ యువకులు మాత్రమే ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది. సీమాంధ్రతో పాటు.. తెలంగాణలోని మరో ఐదు జిల్లాల ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంది.
అందువల్ల ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ప్రజారాజ్యం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం మోసం చేసి తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఏకపక్షంగా ఆమోదించుకుందని ప్రరాపా ఆరోపించింది. ఈ తీర్మానాన్ని గురువారం ప్రవేశపెట్టారు. శుక్రవారం సభా కార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే ఫ్రీజోన్‌పై చర్చించాలని ప్రరాపా పట్టుబట్టింది. దీనికి స్పీకర్ ససేమిరా అనడంతో ఆ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లడంతో సభ వాయిదా పడింది.
ఆ తర్వాత ప్రరాపా శాసనసభా కార్యాలయంలో ఉన్న చిరంజీవి వద్దతు నన్నపనేని రాజకుమారి వెళ్లి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే ముందుకు సాగాలని సలహా ఇచ్చారు. రాజకీయాల్లో "శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు" ఉండరనే నానుడికి ఇది ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు.