ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ చెప్పారు. ఎన్నికల ఫలితాలపై ఆయన తన నివాసంలో శుక్రవారం స్పందిస్తూ తెలంగాణ సెంటిమెంట్‌కు ఓటర్లు పట్టం కట్టారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టిజాక్ ఇచ్చిన పిలుపునకు స్పందించి తమ పదవులను త్యజించిన సభ్యులకు ఈ ప్రాంత ప్రజల అండగా నిలిచారన్నారు. అందువల్ల ఈ తీర్పును తాము గౌరవిస్తూ స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
ఇకపోతే... తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అప్పటికీ ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు డీఎస్ స్పష్టం చేశారు. కాగా, నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి పోటీ చేసిన డీఎస్.. తన సమీప ప్రత్యర్థి లక్ష్మీనారయణ (భాజపా) చేతిలో 11981 ఓట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెల్సిందే.