ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కాంగ్రెస్ ఉప్పు నీటిలో జగన్ మంచినీటి బిందువు: అంబటి (Congress | Salt water | Jagan | Ambati Rambabu | Regional)
కాంగ్రెస్ ఉప్పు నీటిలో జగన్ మంచినీటి బిందువు: అంబటి
కాంగ్రెస్ అనే ఉప్పునీటి సముద్రంలో వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఒక మంచినీటి బిందువు అని సస్పెండ్‌కు గురైన పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఈ విషయాన్ని గుర్తించి అంబటి సేవలను పార్టీకి వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ముఖ్యమంత్రి రోశయ్యపై చేసిన విమర్శలకు ఇచ్చిన షోకాజ్ నోటీపై క్రమశిక్షణా కమిటీకి వివరణ ఇచ్చేందుకు ఆయన శనివారం ఉదయం గాంధీభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం కమిటీకి వివరణ ఇచ్చేందుకు ఇక్కడకు వచ్చానన్నారు. అయితే ఇక్కడ ఎవ్వరూ లేకపోవడంతో తిరిగి వెళ్లిపోతున్నట్టు చెప్పారు.
తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు అధిష్టానం నుంచి ఇప్పటి వరకు తనకు ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు. అందువల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేశారో లేదో స్పష్టం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీకి లేఖ రాసినట్టు అంబటి తెలిపారు.
తన సస్పెన్షన్ అంశంలో పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం లేదన్నారు. క్రమశిక్షణా సంఘం విచారణ జరుపకపోతే తన సస్పెన్షన్ చెల్లదని అంబటి అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రయోజనాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న సీనియర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.