తెలంగాణా ఆకాంక్ష నెరవేరాలని కోరుతూ మరో విద్యార్థి ఉస్మానియా యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ స్థానంలో డీ. శ్రీనివాస్ ఓడి అన్ని స్థానాల్లో తెలంగాణా రాష్ట్ర సమితి తిరిగి విజయం సాధిస్తే తనను తాను ఆత్మార్పణం చేసుకుంటానని మెదక్ జిల్లాకు చెందిన విద్యార్థి ఇషాంత్ రెడ్డి తన సూసైడ్ నోట్‌లో రాసి పెట్టాడు.
ఇషాంత్ రెడ్డి మరణ వార్త విని అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా విద్యార్థి అంతిమ యాత్ర ఉస్మానియా యూనివర్శిటీ నుంచి గన్ పార్క్ వరకూ జరుగుతోంది. ఈ అంతిమ యాత్రలో తెరాస చీఫ్ కేసీఆర్ తో పాటు భాజపా నాయకులు, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.
ఉస్మానియా పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతవరణం నెలకొనడంతో పోలీసులు ఇషాంత్ అంతిమ యాత్రను అడ్డుకున్నారు. అయితే విద్యార్థులు వారిని తోసుకుంటూ ముందుకు తరలి వెళుతున్నారు.
ఇదిలావుండగా తెలంగాణా ఆకాంక్ష నెరవేరడానికి బలిదానాలే మార్గం కాదని తెలుగుదేశం పార్టీ కడియం శ్రీహరి అన్నారు. ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు క్షోభకు గురి చేయవద్దని ఆయన కోరారు.