నాలుగుకోట్ల మంది తెలంగాణా ప్రజలు ఏకమై ఒక్కతాటిపై నిలబడి పాలనా కార్యక్రమాలను స్తంభిపజేస్తే కేంద్రం సలాం కొట్టి తెలంగాణాను రాసి ఇస్తుందని తెరాస చీఫ్ కేసీఆర్ జోస్యం చెప్పారు. తమ పార్టీకి చెందినవారు 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారనీ, అదే 100 మంది ఉంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణా భవన్‌కు సలాం కొట్టి తెలంగాణా రాష్ట్రాన్ని రాసిస్తుందని అన్నారు.
ప్రస్తుతం తమ పార్టీకి తగినంత బలం లేదు కనుక రాజకీయంగా ఒత్తిడి సాధ్యం కాదనీ, తెలంగాణా రావాలంటే నాలుగుకోట్లమంది తెలంగాణా ప్రజలు ఏకమై పాలనను స్తంభింపజేయాలన్నారు. డిసెంబరు 31కి ముందు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సిగ్నల్ ఇస్తే సరే.. లేదంటే గాంధీజీ బాటలో సహాయ నిరాకరణ ఉద్యమం పెద్ద ఎత్తున చేసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఏ ఊళ్లో ఉన్నవాళ్లు ఆ ఊళ్లోనే పాలనా కార్యక్రమాలను స్తంభింపజేయాలన్నారు. ఒక్క బస్సు కదలనివ్వకూడదు. రైలు నడవకూడదు. షాపులు తెరవకూడదు. ఏ ఒక్క ఉద్యోగి తన విధులకు హాజరు కాకూడదు. మొత్తం.. అన్ని కార్యక్రమాలు బంద్ అయిపోవాల. అప్పుడే కేంద్రం తెలంగాణా రాష్ట్రాన్ని ఇస్తుందని కేసీఆర్ అన్నారు.
తెలంగాణా జాతి విముక్తికోసం చేస్తున్న పోరాటంలో ఇపుడున్నవారిని నమ్ముకుంటే తెలంగాణా ఎన్నటికీ రాదనీ, ప్రజలే నడుం బిగించి ఒక్కసారిగా జై తెలంగాణా అంటే మన రాష్ట్ర మనకు ఖచ్చితంగా వస్తుందనీ, డిసెంబరు 31 దాకా వేచి చూద్దామని కేసీఆర్ పేర్కొన్నారు.