ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తిరుపతికి చేరుకున్న ప్రధాని: పర్యటన వివరాలు ఇవే! (Tirupati | PM | BHEL | NTPC | Regional | Narasimhan | Mannavaram)
విద్యుత్ ఉత్పత్తి ఉపకరణాల తయారీ ప్రాజెక్టును ఎన్టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌లు సంయుక్తంగా నెలకొల్పనున్నాయి. ఈ ప్రాజెక్టుకు పునాదిరాయి వేసేందుకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ బుధవారం రాష్ట్రానికి వచ్చారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం మన్నవరం గ్రామంలో ఈ ప్రాజెక్టును నెలకొల్పనున్నారు.
ఇందుకోసం ప్రధాని బుధవారం ఉదయం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి తరపున రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి కన్నా లక్ష్మీనారాయణలు స్వాగతం పలికారు. కాగా, ప్రధాని పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మన్నవరం వెళతారు. 11 గంటలకు మన్నవరం వద్ద ఎన్టీపీసీ-భెల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. 11.45 గంటలకు హెలికాప్టర్‌లో తిరుపతికి, ఇక్కడి నుంచి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు.
అనంతరం సాయంత్రం మూడు గంటలకు తిరుపతికి చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్‌లో 4.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వెళతారు. అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారు. విశ్రాంతి అనంతరం, 5.15 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. కాగా, ప్రధాని వెంట కేంద్ర మంత్రి పనబాల లక్ష్మి, ఎంపీలు జేడీ శీలం, వీహెచ్‌లు వస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి కూడా ప్రధానిని మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు.