ఏదైనా సమస్యను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప పంతాలకు ప్రతీకారాలకు పోతే సమస్య మరింత జఠిలం అవుతుందని జస్టిస్ శ్రీకృష్ణ అభిప్రాయపడ్డారు. వరంగల్ జిల్లాలో సంప్రదింపులకు వచ్చిన కమిటీ సభ్యులు ప్రజల వాదనలు విన్నారు.
అనంతరం జస్టిస్ శ్రీకృష్ణ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత శ్లోకాలలోని కొన్నిటిని వివరిస్తూ పంతాలు, పట్టింపులు సమస్యకు ఎన్నడూ పరిష్కారం చూపవన్నారు.
ఇదిలావుండగా వరంగల్ జిల్లాలో కమిటీ సభ్యులను తామంతా కలిసి తమ వాదనలను వినిపించాలని న్యాయవాదులు ఆందోళనకు దిగారు. అందరి తరపున ఒకే ఒక్క న్యాయవాదిని అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇప్పటివరకూ తాము రాష్ట్రంలో పలు ప్రాంతాలలోని ప్రజలతో సంప్రదింపులు జరిపామనీ, ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో అందరి అభిప్రాయాలను క్రోఢీకరించి ఆమోదయోగ్యమైన ఓ పరిష్కార మార్గాన్ని సూచిస్తామని వెల్లడించారు.