గ్రూపు-1 ఉద్యోగాల్లో తెలంగాణ వాటాను ఖరారు చేయాలని కోరుతూ ఈనెల ఐదో తేదీన తెలంగాణ ప్రాంత బంద్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యచరణ సమితి (ఓయూ జేఏసీ) గురువారం పిలుపునిచ్చింది. ఇందులోభాగంగా ఈనెల నాలుగో తేదీన తరగతులను బహిష్కరించాలని ఓయూ జేఏసీ నేతలు వెల్లడించారు.
గ్రూపు-1 ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాత పరీక్షలను నిర్వహించనుంది. అయితే, గ్రూపు-1 ఉద్యోగాల్లో తెలంగాణకు దక్కాల్సిన 42 శాతం వాటాను ఖచ్చితంగా కేటాయించాల్సిందేనని ఓయూ జేఏసీ డిమాండ్ చేస్తున్నారు. దీనికి అటు ప్రభుత్వం లేదా ఇటు ఏపీపీఎస్సీ స్పష్టమైన ప్రకటన చేయలేదు.
ఈ నేపథ్యంలో గ్రూపు-1 పరీక్షలను అడ్డుకుంటామని జేఏసీ నేతలు హెచ్చరించారు. అంతేకాకుండా, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే పరీక్షలకు హాజరై ప్రశ్నాపత్రాలను చింపి వేయాల్సిందిగా జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ప్రధానంగా నాలుగో తేదీ లోపు తమ వాటను తేల్చాలని లేని పక్షంలో ఐదో తేదీన తెలంగాణ ప్రాంత బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు.