ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జగన్ 'ఓదార్పు' వైపు కన్నెత్తి చూడని మెజారిటీ ఎమ్మెల్యేలు! (Kadapa MP Jagan | Prakasm District | Majority MLAs)
జగన్ 'ఓదార్పు' వైపు కన్నెత్తి చూడని మెజారిటీ ఎమ్మెల్యేలు!
FILE
కడప ఎంపీ వై.ఎస్. జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రపై కాంగ్రెస్ అధిష్టానం వైఖరి కచ్చితంగా తెలియరావడంతో జగన్ ఓదార్పు యాత్రపై మెజారిటీ ఎమ్మెల్యేలు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడుతున్నారు.
చెప్పిన మాట వినని మొండిఘటంగా సోనియా గాంధీచే ముద్రవేసుకున్న జగన్ దారిన నడిచేందుకు ఎమ్మెల్యేలు జంకుతున్నారు. జగన్‌పై సోనియా గాంధీ ఆగ్రహంతో ఉన్నారనే వాస్తవాన్ని గ్రహించిన ఎమ్మెల్యేలు శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో ఆరంభమైన ఓదార్పు యాత్రలో పాల్గొనకూడదని నిశ్చయించుకున్నట్లు సమాచారం. తమపై జగన్ వర్గం నుంచి ఒత్తిడి వచ్చినా ఏ మాత్రం పట్టించుకోకూడదనే నిర్ణయానికి వచ్చారు.
అయితే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్ తోడల్లుడు వై.వి.సుబ్బారెడ్డి, దర్శి ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి మాత్రం మొత్తం యాత్రను పర్యవేక్షిస్తున్నారు. బాలినేని, శివప్రసాదరెడ్డి మినహా ఎమ్మెల్యేలెవరూ యాత్రలో పాల్గొనే అవకాశాలు లేవని తెలుస్తోంది.
అయితే ఎమ్మెల్యేలు జగన్ ఓదార్పు యాత్రకు రాకపోతే ఎలాంటి నష్టం లేదని బాలినేని శ్రీనివాస రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు రాకున్నా యాత్ర దిగ్విజయంగా సాగించి సత్తా చాటుకోవాలనే పట్టుదలతో జగన్ వర్గం తీవ్రంగా యత్నిస్తోంది.