'ఓదార్పు'పై 2 వారాల్లోపు సమాధానం ఇవ్వాలి: హైకోర్టు
వైఎస్. జగన్మోహన రెడ్డి తలపెట్టిన "ఓదార్పు యాత్ర"పై ఒకవైపు అధిష్టానం గుర్రుగా ఉంటే, తాజాగా రాష్ట్ర హైకోర్టు ఓదార్పుపై ప్రభుత్వానికి నోటీసు పంపింది. వై.ఎస్. జగన్ ఓదార్పు యాత్రపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి, డీజీపీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని, దాన్ని నియంత్రించడంతో పాటు కాలవ్యవధి నిర్దేశించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్రకు మామ అయిన తూర్పు గోదావరి జిల్లావాసి ఎ.కృష్ణారావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఓదార్పుపై రెండు వారాల్లోగా సమాధానమివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఓదార్పు యాత్రతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది ఐవి. రాధాకృష్ణ మూర్తి చెప్పారు. ఒక పార్లమెంటు సభ్యుడి వ్యక్తిగత యాత్రకు పోలీసులు భద్రత కల్పిస్తూ పోతే ఇతర కార్యక్రమాలను నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు. యాత్రకు మార్గదర్శకాలను జారీ చేసేలా ఆయా జిల్లా పాలనాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరారు.