ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » మరో నాలుగు నెలల్లో ఎవరి వాటాలు ఎంతో తేలుతాయ్ (Botsa Satyanarayana | APPSC | Group 1 | Telangana | Seemandhra)
గ్రూప్ 1 పరీక్షకు తెలంగాణా ప్రాంత నాయకులు, ఏబీవీపీ కార్యకర్తలు మోకాలడ్డటం మానుకోవాలని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. మరో నాలుగు నెలల్లో ఎవరి వాటాలు ఎంతో నిర్ణయమైపోతాయి కనుక వాటాలు గురించి ఇపుడు ఆందోళన చెందనవసరం లేదని చెప్పుకొచ్చారు.
ఏపీపీఎస్సీ పరీక్షలకోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులంతా సిద్ధమైన ప్రస్తుత తరుణంలో పరీక్షలను ఆపాలనడం సమంజసం కాదన్నారు. మెరిట్ ప్రకారం ఎవరు ప్రతిభావంతులో వారికే సీట్లు దక్కుతాయని బొత్స అన్నారు.
ఇక వాటాల విషయానికి వస్తే.. ఇంకా రాష్ట్రం విడిపోలేదు కనుక దాని గురించి ఇప్పటికిప్పుడు మాట్లాడి, వాటాలను నిర్ణయించమనడం భావ్యం కాదన్నారు. మరో నాలుగు నెలలు ఓపిక పడితే శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమర్పిస్తుందనీ, కమిటీ ఏ తీర్పు చెపుతుందో దానిని తాను శిరసా వహిస్తానని మంత్రి బొత్స వెల్లడించారు.