రాష్ట్రంలో పరిపాలన ఉన్నదా లేదా అని ప్రజలు అనుమానంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. దీంతో రోశయ్యకు పూర్తిస్థాయిలో సహకారం అందటం లేదు. ఫలితంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దొడ్డి దోవన బ్లాక్ మార్కెట్లో యూరియా నిల్వలు నడిచి వెళుతున్నా ప్రభుత్వం నియంత్రించలేక పోతోందని విమర్శించారు. పోలీసు స్టేషన్లకు వెళ్లి రైతులు ఎరువులు కొనుగోలు చేసుకునే హీనమైన పరిస్థితికి సర్కార్ తీసుకువచ్చిందన్నారు. ఏదైనా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే రోడ్డెక్కుతుంటేనే అవుతున్నాయన్నారు.
అంతర్గత కుమ్ములాటలతో బజారుపడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వారిని బజారున పడేయాలని చూస్తే ఊరుకోబోమని చిరంజీవి హెచ్చరించారు. ఇక ఎమ్మార్ అవినీతి గురించి మాట్లాడుతూ.. ఇపుడు కేవలం తీగ మాత్రమే కదిలిందనీ, ఇంకా డొంక కదలాల్సి ఉందన్నారు.
అవినీతికి పరాకాష్టలాంటి ఇంటువంటి కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ఆస్తులను లూటీ చేస్తున్న బడా నాయకులను ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు.