ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సందేశాత్మక చిత్రంలో నటించేందుకు సమ్మతం: చిరు (Chiru | New film | PRP | Tagore | Stalin | Steps | Regional)
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మరోమారు మాటమార్చనున్నారు. ప్రత్యేక తెలంగాణ, సామాజిక న్యాయం అంశాల్లో ఆయన మాటకు కట్టుబడని విషయం తెల్సిందే. నిన్నమొన్నటి వరకు సినిమాలకు దూరంగా ఉంటానని, ప్రజాసేవకే ఈ జీవితం అంకితమని ప్రచారం చేస్తూ వచ్చిన చిరంజీవి బుధవారం మాటమార్చారు.
వచ్చే యేడాది ఆరంభంలో తన కొత్త సినిమా ఉంటుందని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇందుకోసం మంచి కథ కోసం అన్వేషణ సాగుతోందన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఠాగూర్, స్టాలిన్ చిత్రాల్లా ఉంటాయన్నారు. ఈ చిత్రం సామాజిక స్పృహ, వినోదం కలగలిసి ఉంటుందన్నారు. పైపెచ్చు.. ప్రస్తుతం కీలక బాధ్యతల్లో ఉన్నందు వల్ల విమర్శలకు తావులేకుండా రూపొందించనున్నట్టు చెప్పారు.
అలాగే, చిత్ర పరిశ్రమ తనకు కుటుంబంలాంటిదని, దానిని విస్మరించడం జరగదని చిరంజీవి పేర్కొన్నారు. తన కొత్త చిత్రంలో స్టెప్పులు ఉంటాయా అని ఓ విలేకరి ప్రశ్నించగా, తానేమీ సన్యాసం పుచ్చుకోలేదని, అందువల్ల ఓహో స్థాయిలో లేకపోయినా ఓ మోస్తారుగా ఉంటాయని చెప్పారు. కాగా, చిరంజీవి చేసిన తాజా ప్రకటనపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.