ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » మావోయిస్టుల పేరుతో తెలంగాణ వ్యతిరేకుల లేఖ : తెరాస (Maoists | Telangana | trs | Chandrababu | Lagadapati)
మావోయిస్టుల పేరుతో తెలంగాణ వ్యతిరేకుల లేఖ : తెరాస
శనివారం, 28 జనవరి 2012( 11:05 IST )
మావోయిస్టుల పేరుతో తెలంగాణ వ్యతిరేక శక్తులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమనేతలకు హెచ్చరికల లేఖలు రాస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపించింది. ఈ లేఖల వెనుక తెలంగాణ రాష్ట్ర సాధనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌లు ఉన్నారని తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు జి.జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు.
దీనిపై ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకులు కె.చంద్రశేఖర్ రావు, టీఎన్జీవో నేత స్వామిగౌడ్, టీ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌లపై మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖ తెలంగాణ వ్యతిరేకుల పనేనని విమర్శించారు.
తెలంగాణకు బద్ధవ్యతిరేకులైన చంద్రబాబు, లగడపాటి రాజగోపాల్, మరికొందరు పోలీసులు కుమ్మక్కై ఆ లేఖను విడుదల చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని గందరగోళపర్చడానికి మావోయిస్టులు పేరుతో తెలంగాణ వ్యతిరేకులు ఇలాంటి బోగస్ లేఖలు సృష్టిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని ఆయన జోస్యం చెప్పారు.