ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రాష్ట్రంలో ఎటుచూసినా ఆందోళనలే: తెరాస చీఫ్ కేసీఆర్ (Kcr | Juda | Telangana | trs | dl | Kiran Kumar Reddy)
రాష్ట్రంలో ఎటుచూసినా ఆందోళనలే: తెరాస చీఫ్ కేసీఆర్
మంగళవారం, 31 జనవరి 2012( 15:23 IST )
FILE
రాష్ట్రంలో ఎటుచూసినా ఆందోళనలేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు, వస్త్ర వ్యాపారులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పారు.
గాంధీ ఆస్పత్రిలో జూడాలను మంగళవారం పరామర్శించి, మద్దతు తెలిపిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. జూడాల పట్ల ప్రభుత్వం, ఆరోగ్య శాఖ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు.
జూడాల సమ్మె కొత్తేమీ కాదని, స్టయిఫండ్ కోసం జూడాలు రాజీలేని పోరాటం చేస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పోలీసులు నిర్ధాక్షిణ్యంగా మహిళా డాక్టర్లను కూడా అరెస్ట్ చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్టయిఫండ్ లేకుండా జూడాలు ఎలా బతకాలని కేసీఆర్ ప్రశ్నించారు. ఆరోగ్య శాఖా మంత్రి డీఎల్‌కు- రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య విబేధాలున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
సమ్మె చేస్తున్న వారిపై ఎస్మా విధిస్తున్న ప్రభుత్వం, మంత్రుల జీతభత్యాలను పెంచుకుంటుందని ధ్వజమెత్తారు. జూడాల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, సకలజనుల సమ్మెను ఎదుర్కొన్న ఈ ప్రభుత్వానికి జూడాల సమ్మె ఓ లెక్కా అని కేసీఆర్ చెప్పారు. జూడాల సమస్యల పరిష్కారానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.