తెలంగాణ ప్రాంత పల్లెప్రజలు ఆషాఢ మాసంలో బోనాల పండుగను ప్రారంభించి శ్రావణ మాసం ముగిసే వరకు జరుపుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంత ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలు, ఆనందోత్సాహాలతో జరుపుకునే బోనాల పండుగకు విస్తృతస్థాయిలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
రకరకాల పూజలు, పునస్కారాలతో అమ్మవారిని ఆదిశక్తిగా, మాతృమూర్తిగా, దేవీ స్వరూపంగా పలు పేర్లతో వర్ణిస్తూ ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ బోనాల ఉత్సవాలు హైదరాబాద్‌లో గురువారం నుంచి జరుగనున్నాయి.
మహిళలు పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి.. పైన జ్యోతిని వెలిగించిన బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి బోనాన్ని, వేపాకు, నీళ్లతో కూడిన సాకను సమర్పించడం ఆనవాయితీ. డప్పుచప్పుళ్లు, మంగళవాయిద్యాలతో జరిగే ఆ ఊరేగింపులో యువకుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, డోళీ అడుగులు, శివసత్తుల శిగాలు ఈ ఉత్సవాల్లో కనిపిస్తాయి.
హైదరాబాద్‌లో మొదట గోల్కొండ కోటలోని మాతా జగదాంబికా ఆలయంలో ప్రారంభమవుతాయి. నేటి నుంచి (జూన్ 21న) నుంచి ఉత్సవాలు ప్రారంభమై జూలై 19న ముగుస్తాయి. లంగర్‌హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపుతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ప్రతి గురువారం, ఆదివారాల్లో జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.