ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » బాబు భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని : దేవినేని (Chandrababu | ntr | Kodali Naani | Devineni | Gudiwada)
బాబు భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని : దేవినేని
సోమవారం, 9 జులై 2012( 13:27 IST )
File
FILE
తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష వల్ల కొడాలి నాని కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యేగా గెలుపొందారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి నాని సోమవారం వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ, ఆ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన విషయం తెల్సిందే. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఇదే అంశంపై కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ గుడివాడ ప్రజలు ఎమ్మెల్యే కొడాలి నానిని క్షమించరన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై ఆయన పార్టీకి తీరని నష్టం చేశారని చెప్పారు. ఎన్ని కోట్లకు వైకాపాకు అమ్ముడుపోయాడో నాని స్పష్టం చేయాలని ఉమా డిమాండ్ చేశారు.
నాని చేసిన పనితో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని, ఇదే అంశంపై ఎన్టీఆర్ అభిమానులకు నాని సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, జగన్ వద్దకు వెళ్లొద్దని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు కొడాలి నానియే స్వయంగా తమకు చెప్పారన్నారు.
నాని రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆరోపించారు. కొందరు రాజకీయ నేతలు వైకాపాకు ప్రత్యేక ప్యాకేజీలకు అమ్ముడుపోతున్నారని ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. కొడాలి నానిపై తమకు అదే అనుమానం ఉందని ఆయన చెప్పారు. ఇటువంటి వారు పార్టీని వీడినా, తమకు ఎటువంటి నష్టం లేదని ఆయన జోస్యం చెప్పారు.