2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై వైఎస్.జగన్మోహన్ రెడ్డి కూర్చోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌కు గురైన గుడివాడ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ వీరాభిమాని కొడాలి నాని జోస్యం చెప్పారు. అదేసమయంలో ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.
ఆదివారం అంగలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఇకపై తాను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి బాటలోనే పయనిస్తానని చెప్పారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రానికి జననేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారని తెలిపారు. ఈసారి 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం కాదు కదా.. కనీసం ప్రతిపక్షంలో కూర్చునే శక్తి కూడా లేదని ఆయన జోస్యం చెప్పారు
మూడోసారి కూడా తనకు ఓటు వేస్తే.. రాబోయే టీడీపీ ప్రభుత్వం కలర్ టీవీ, నెలనెలా జీవన భృతి ఇస్తుందని మోసం చేయడం తనకు అన్యాయంగా తోచిందన్నారు. జగన్, విజయమ్మను పరామర్శించడానికి వెళ్తే ఏకపక్షంగా చంద్రబాబు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, తనకు మేలు చేశారని నాని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా కష్టాల్లో ఉన్నవారిని పరామర్శించడం తెలుగువారి సంప్రదాయమని ఆయన చెప్పుకొచ్చారు.