భారత కుబేరుడుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ అవతరించాడు. ఆయన ఆస్తుల విలువ రెండు లక్షల కోట్ల రూపాయలు దాటింది. దేశంలో రెండు లక్షల కోట్ల రూపాయలకు పైబడిన నికర విలువ కలిగిన తొలి వ్యక్తిగా ఆయన తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. ఆకాశమే హద్దుగా నానాటికీ చుక్కల్లోకి దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్ పుణ్యమా అని గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆయన గ్రూప్‌లోని సంస్థల్లో ఆయన షేర్ హోల్డింగ్ విలువ 2,04,945 కోట్ల రూపాయలకు చేరింది.
దీంతో దేశంలోని అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్తగా ఆయన తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. ఇకపోతే.. ఆయన సోదరుడు అనిల్ అంబానీ 1,17,710 కోట్ల రూపాయల నికర విలువతో ద్వితీయ స్థానంలో ఉండగా, రియల్ ఎస్టేట్ సంస్థ డిఎల్‌ఎఫ్ అధిపతి కె.పి.సింగ్ 1,15,225 కోట్ల రూపాయల నికర విలువతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
|