చెన్నై నగరంలోని తెలుగు ప్రజలను ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ఆంధ్ర క్లబ్ అధ్యక్షుడు కె.సుబ్బారెడ్డి అంటే తెలియని తెలుగువారు ఉండకపోవచ్చు. తండ్రి వారసత్వం నుంచి వ్యాపార పగ్గాలను చేపట్టిన ఈయన అంచలంచెలుగా తమ గ్రానైట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. ఆ తర్వాత చెన్నైలోని ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా) అధ్యక్ష పదవికి పోటీ చేసి విజయం సాధించిన ఈయన.. రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.
నగరంలో జరిగే ప్రతి తెలుగు కార్యక్రమాలలో పాల్గొనే ఆయన, ఆ సమావేశాల్లో తెలుగు ప్రజల సమస్యలను ప్రధానంగా ప్రస్తావించడమే కాకుండా వాటి పరిష్కారానికి నడుంబిగిస్తున్నారు. అటు వ్యాపారరంగంలోను, ఇటు ప్రజాసేవలోను ముందుకు సాగుతున్న శ్రీ సుబ్బారెడ్డితో 'వెబ్‌దునియా' తెలుగు జరిపిన ప్రత్యేక ఇంటర్వూ....
ప్రశ్న: మీరు ఆస్కా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లబ్ అభివృద్ది ఎంతో పుంజుకుంది? ఎలా సాధ్యమైంది? జ: నేను అధ్యక్షుడుకాక మునుపు ఆస్కా పరిపాలన సజావుగా సాగలేదు. మా కార్యవర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత అనవసరపు ఖర్చులు తగ్గించాం. అదనపు సిబ్బందిని తొలగించి, సభ్యుల సంఖ్యకు సరిపడే విధంగా సిబ్బందిని ఉంచాం. అందువల్లే ఇది సాధ్యమైంది.
ప్ర: ఇటీవలి కాలంలో ఆస్కాలో ఎక్కువగా తెలుగు కార్యక్రమాలు నిర్వహించడానికి గల కారణం? జ: ఇక్కడకు ఎంతో మంది ప్రముఖులు వస్తుంటారు. వారు కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలకు యాదృచ్ఛికంగా హాజరవుతుంటారు. అందువల్ల ఇక్కడ తెలుగు ప్రజల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లటం సులభం. క్లబ్‌లో అనేక మంది విఐపీలు సభ్యత్వం కలిగి ఉన్నారు. వారి సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం.
|