ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
 
నేడే ప్రపంచ తపాలా దినోత్సవం
FileFILE
ఐక్యరాజ్య సమితి చేపట్టిన తీర్మానాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం అక్టోబర్ 9వ తేదీని అంతర్జాతీయ తపాలా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులలో తపాలా సౌకర్యాన్ని "తెలుగు ప్రజలు ఏవిధంగా వినియోగించుకుంటున్నారు" అనే అంశంపై మీ అభిమాన పోర్టల్ "తెలుగు వెబ్‌దునియా" ఓ సర్వే నిర్వహించింది. సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.

తరతరాలుగా తమ జీవన స్రవంతిలో మమేకమైపోయిన ఉత్తరం పట్ల తమకు గల మమకారాన్ని చిన్నా పెద్దా తేడా లేకుండా స్త్రీ, పురుష బేధం పాటించకుండా ప్రతి ఒక్కరూ చాటుకున్నారు. అయితే ప్రపంచీకరణ మరియు సరళీకృత ఆర్థిక విధానాల చొరబాటుతో తమ జీవితాల్లోకి చొచ్చుకు వచ్చిన ఇంటర్నెట్ మరియు ఎస్ఎంఎస్‌ల ప్రాధాన్యతను వారు తోసి రాజనలేకపోతున్నారు.

మా సర్వేలో 35 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వయస్సు మధ్యలో గలవారిని తపాలా పట్ల వారి అభిప్రాయాన్ని చెప్పమని కోరగా, ఎనలేని ఉత్సాహంతో తమ అనుభవాలను చెప్పుకొచ్చారు. చిన్నప్పటి పాఠశాల రోజుల్లో పుస్తకాల్లో రాసిన హెడ్‌మాస్టర్‌కు సెలవు చీటీ నుంచి కాలేజీ రోజుల్లో ఖర్చుల కోసం తల్లిదండ్రులకు రాసే ఉత్తరం, స్నేహితులతో సత్సంబంధాలు పాదుకొల్పేందుకు, అనంతరం జీవితానికో అర్థం తెచ్చి పెట్టే ఉద్యోగం కోసం చేసే దరఖాస్తుకు అంటించే తపాలా బిళ్ళలు... ఇలా ఎన్నెన్నో విషయాలను వెల్లడించారు. వారిలో అనేకులు ఇప్పటికీ తపాలా సేవలను వినియోగించుకుంటున్నట్లు తెలిపారు.

ఇక యువతరాన్ని కదిలించగా... ఇ-మెయిల్, ఎస్ఎంఎస్‌లకే తమ తొలి ప్రాధాన్యతగా వెల్లడించారు. అత్యవసర సందర్భాలలో, ఉన్నత విద్యకు అవసరమైన దరఖాస్తులను పంపించే సందర్భాల్లో మాత్రమే తపాలా సేవలను ఉపయోగించుకుంటున్నట్లు వెల్లడించారు.

అయితే ఇ-మెయిల్, ఎస్ఎంఎస్‌లు కేవలం టెలిగ్రాం రూపంలో హడావుడిగా సమాచారాన్ని పంపేందుకు ఉపయోగపడతాయని, ఆప్తులతో మనసు విప్పి మాట్లాడుకునేందుకు ఉత్తరమే శరణ్యమని మధ్య వయస్కులు, సీనియర్ సిటిజన్లు బల్ల గుద్ధి మరీ చెప్తున్నారు.

ఏది ఎలా ఉన్నా.. "తోకలేని పిట్ట తొంభై ఆమడలు దూరం పోతుంది" అన్న సామెతను అక్షరాల నిజం చేస్తూ.. అతి తక్కువ ధరకే సేవలందిస్తున్న తపాలాకు, గ్రామీణ ప్రజలకు మధ్య అనుబంధం దినాదినాభివృద్ధి చెందుతున్న వైనం మా సర్వే ద్వారా తేటతెల్లమైంది.
మరిన్ని
చెన్నై తెలుగువాసుల ఐక్యతే నా లక్ష్యం: సుబ్బారెడ్డి
నేడు భారత వైమానిక దళ వ్యవస్థాపక దినోత్సవం
ఈ వారం బ్లాగు '24 ఫ్రేములు, 64కళలు'
2011లో చంద్రయాన్-2 ప్రయోగం
భారత కుబేరుడుగా రిలయన్స్ అధినేత
'ఇండియన్ ఐడాల్-3' విజేతగా ప్రశాంత్ తమంగ్