కృత్రిమ ఉపగ్రహాలను కలిగి ఉన్న దేశాల సరసన త్వరలో వియత్నాం కూడా చేరనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వినాశాట్-1 ఉపగ్రహాన్ని ఏప్రిల్ 12న అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు సన్నాహాలను పూర్తి చేసే కార్యక్రమాల్లో ప్రభుత్వం ఉన్నట్లు వియత్నాం అధికార వర్గాలు వెల్లడించాయి.
హనోయ్‌లో వియత్నాంకు చెందిన పోస్ట్ మరియు టెలికమ్యూనికేషన్ కార్పొరేషన్ ఉప నిర్ధేశకులు, ఈ ఉపగ్రహానికిచెందిన ప్రాజెక్టు ఇన్వెస్టర్ ఎన్గుయ్ బా తువోక్ మీడియాతో ఈ మేరకు మాట్లాడారు. ఫ్రెంచ్ గయానాలోని కౌరోవు అంతరిక్ష కేంద్రం నుంచి ఫ్రెంచ్ కంపెనీకి చెందిన ఆరియాన్ అంతరిక్ష నౌక ద్వారా వినాశాట్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలిపారు.
సుమారు 2.6 టన్నుల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని అమెరికా ఆధారిత సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ తయారుచేసింది. వినాశాట్-1 ఉపగ్రహం అత్యాధునికమైనదే కాక.. శక్తివంతమైన ట్రాన్సిమిషన్ కెపాసిటీ కలిగి ఉందని తువోక్ వివరించారు.
ఈ ఉపగ్రహం సుమారు 120 టీవీ ఛానెళ్లు, 10వేల ఇంటర్నెట్ మరియు డేటా ఛానెల్స్‌కు సమానమని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఉపగ్రహ ప్రయోగంతో టెలికమ్యూనికేషన్, రేడియా, ఇంటర్నెట్ సౌకర్యం, టీవీ సేవలు తదితరమైనవన్నింటికీ సంబంధించి దేశ నలుమూలలా కల్పించవచ్చని వియత్నాం అధికార వర్గాలు తెలిపాయి.
అంతేకాక స్థలానికి సంబంధించిన వివరణలు, వాతావరణ నివేదికలు... నౌకాదళానికి చెందిన సమాచారం, భూగర్భ చమురు నిల్వలు, ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు, విద్యాసేవలు వంటి విలువైనవి కూడా ఈ ఉపగ్రహం అందించనుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
|