వివిధ అంశాల ప్రాతిపదికగా తయారైన ప్రపంచ శాంతియుత దేశాల జాబితాలో భారత్‌కు 107 స్థానం దక్కింది. అహింసా మూర్తి మహాత్మా పుట్టిన భారతావనిలో శాంతికి చోటు తక్కువేనని ప్రపంచ శాంతి సూచీ (జీపీఐ) తేల్చింది. ఇకపోతే శాంతి దేశంగా ఐస్‌లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. మానవ హక్కుల పరిరక్షణ, వివాదాలు, ఖైదీల సంఖ్య, రక్షణ శాఖ వ్యయం తదితర అంశాలను పరిగణంలోకి తీసుకొని మొత్తం 140 దేశాలతో ఈ జాబితాను తయారు చేశారు.
ఇందులో అతి చిన్న దేశమైన ఐస్‌లాండ్ తొలి స్థానంలో ఉండగా, అగ్రదేశం అమెరికా 97వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కంటే ఈ దఫా అమెరికా ఒక స్థానం దిగజారటం గమనార్హం. ఇకపోతే రష్యా 131 స్థానంలోను, చైనా 76, బ్రిటన్ 49, జర్మనీ 14, ఫ్రాన్స్ 36 స్థానాల్లో నిలిచాయి.
తొలి పది స్థానాల్లో ఐస్‌లాండ్, డెన్మార్క్, నార్వే, న్యూజిలాండ్, జపాన్, ఐర్లాండ్, పోర్చుగల్, ఫిన్‌లాండ్, లక్జెంబర్గ్, ఆస్ట్రియాలు చోటు సంపాదించి, అత్యంత శాంతియుత దేశాలని ప్రపంచ శాంతి సూచీ తేల్చింది. చివరి స్థానాల్లో ఇరాక్, సోమాలియా, సూడాన్, ఆఫ్గనిస్తాన్ దేశాలు ఉన్నాయి.
|