కేంద్రంలో అణు సంక్షోభం ముదిరి పాకాన పడింది. ఈనెలలో జపాన్‌లో జరుగనున్న జి-8 సదస్సుకు వెళ్లాలంటే అణు ఒప్పందంపై తాడోపేడో తేల్చాల్సిందేనని ప్రధాని తెగేసి చెప్పారు. జి-8కు హాజరైతే విడాకులు ఖాయమని లెఫ్ట్ నేతలు తేల్చి చెప్పారు. దీంతో సమస్య తీవ్రరూపం దాల్చింది. ఏ క్షణమైనా లెఫ్ట్ తన మద్దతును ఉపసంహరించుకోవడం ఖాయమని తెలుస్తోంది.
ప్రధాని తెగించి వ్యాఖ్యలు చేయడానికి కారణాలు లేకపోలేదు. లోక్‌సభ ఎన్నికల గడువు దగ్గర పడటం ఒక కారణం. మరొకటి.. ఎలాగో ములాయం సింగ్ నేతృత్వంలోని ఎస్పీ ఆదుకుంటుందనే ధీమా ఆయనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. స్వదేశీయంగా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. జపాన్‌లో జరుగనున్న జి-8 సదస్సుకు ప్రధాని బయలుదేరి వెళ్ళనున్నారు. అణు ఒప్పందంపై ముందుకే వెళ్లాలన్న ప్రభుత్వ వైఖరిని వామపక్ష నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
మద్దతు ఉపసంహరణపై వామపక్షాలూ వేటికవే తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. వచ్చే శుక్రవారం జరుగనున్న ఆయా పార్టీల సమావేశాల్లో దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. “అణు ఒప్పందంపై ఆమోదం వచ్చే వరకూ జి-8 సదస్సుకు వెళ్లేది లేదని గతంలో ప్రధాని చెప్పారు. కానీ జులై ఏడో తేదీన బయలుదేరి వెళుతున్నారు. అంటే, ఐఏఈఏతో భద్రతా ప్రమాణాల ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికే అని అర్థమవుతోంది” అని వామపక్ష వర్గాలు పేర్కొన్నాయి.
దీంతో ప్రభుత్వానికి మద్దతు ‘ఎప్పుడు’ ఉపసంహరించాలన్న విషయమై చర్చలు జరుపుతున్నామని ఆ పార్టీల వర్గాలు వివరించాయి. మరోవైపు సోమవారం తన నివాసంలో జరిగిన విలేఖరులతో ప్రధాని వామపక్షాల హెచ్చరికలను తేలిగ్గా కొట్టిపడేశారు. అవి కొత్తగా చేస్తున్న హెచ్చరికలేమీ కాదన్నారు. వామపక్షాల అభ్యంతరాలతో సహా అన్ని సమస్యలనూ ప్రభుత్వం పరిష్కరించగలదన్న ధీమాను వ్యక్తం చేశారు. కానీ ప్రధాని ప్రకటనపై వామపక్షాలు ఏమాత్రం మెత్తబడలేదు.
అణు ఒప్పందంపై ముందుకెళితే మద్దతు ఉపసంహరణ ఖాయమని తేల్చిచెప్పాయి. ప్రధాని ప్రకటనలో కొత్తేమీ లేదని ప్రకాశ్ కరత్ స్పష్టం చేయగా 'మా హెచ్చరికల్లో కొత్తేమీ లేదని ప్రధాని అన్నారు. కానీ ఆయన వైఖరిలోనే కొత్తదనం లేదని మేం చెబుతున్నాం' అని లెఫ్ట్ నేతలు వ్యాఖ్యానించారు. మొత్తం మీద ప్రధాని, సీపీఎం నేతలు చేసిన తాజా వ్యాఖ్యలు సమస్యకు మరింత ఆజ్యం పోశాయి. దీంతో లెఫ్ట్ మద్దతు ఉససంహరణ, యూపీఏ ప్రభుత్వం కుప్పకూలడమే మిగిలివుంది.
|