దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కలవరపడుతోంది. లోగడ ఎన్నో ప్రభుత్వాలను ఈ పార్టీ కూల్చింది. ఎందరో ప్రధానులను ముప్పలు తిప్పలు పెట్టింది. ప్రస్తుతం అదేపరిస్థితి ఇపుడు ఆ పార్టీకి ఎదురవుతోంది. కేంద్రంలోని యూపీఏ సర్కారుకు ప్రాణవాయువు లాంటి లెఫ్ట్ పార్టీలు మద్దతును ఉపసంహరించుకున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సంకీర్ణ సర్కారు మైనారిటీలో పడిపోయంది.
ఈ నేపథ్యంలో వచ్చే 22వ తేదీన బలాన్ని నిరూపించుకునేందుకు ముహుర్తాన్ని ఖరారు చేయగా, దీనికి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆమోదముద్ర వేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు చిక్కంతా 'మ్యాజిక్ ఫిగర్' (లోక్‌సభ సాధారణ మెజారిటీ సంఖ్య 272)పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైవుంది.
కాంగ్రెస్ పార్టీకి సొంతగా 153 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ మిత్రపక్షాలైన ఆర్జేడీకి 24, డీఎంకేకు 16, ఎన్‌సిపికి 11, పీఎంకేకు 6, జేఎంఎంకు 5, ఎల్‌జేపికి 4 సీట్లు ఉండగా, మరో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు మద్దతు తెలుపుతున్నారు. వీటన్నింటితో కలుపుకుంటే.. యూపీఏ కూటమికి మొత్తం 226 సీట్లు వస్తున్నాయి.
అయితే లెఫ్ట్ మద్దతు విరమించుకున్న మరుక్షణమే 39 మంది సభ్యులు కలిగిన సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌కు అండగా నిలిచింది. దీంతో యూపీఏ బలం 265కు చేరుకుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ 272కు మరో ఏడు సీట్ల దూరంలో వచ్చి ఆగింది. ఇదిలావుండగా.. ఎస్పీ పార్టీకి చెందిన ఎంపీల్లో ముగ్గురు తిరుగుబాటు బావుటా ఎగురవేసినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదే నిజమైతే యూపీఏ బలం 262కు తగ్గుతుంది. అపుడు సరిగ్గా పది మంది ఎంపీల మద్దతును సేకరించాల్సి ఉంటుంది. దీన్ని కూడగట్టేందుకు కాంగ్రెస్‌కు చెందిన హేమాహెమీలు రంగంలో దిగారు. సాధారణ మెజారిటీ సాధించి, పూర్తి కాలం అధికారంలో కొనసాగుతామని యూపీఏ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే మద్దతు ఉపసంహిరించిన వామపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని కూల్చి తీరుతామని ఢంకా బజాయిస్తున్నాయి. కాంగ్రెస్, వామపక్షాల మధ్య సాగుతున్న నాటకీయ పరిణామాలను ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఆసక్తికరంగా చూస్తోంది. ఏదేమైనా.. 'మ్యాజిక్ ఫిగర్' కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది.
|