అంతరిక్షం నుంచి భూమిపైకి గ్రహాంతర వాసులు వచ్చే అవకాశం లేదని ఓ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఖరాఖండీగా తేల్చిచెప్పారు. ఇటీవల కాలంలో గ్రహాంతర వాసులు వచ్చి వెళుతున్నారని.. బహుశా వారు ఇక్కడి పరిస్థితులపైన కూడా నిఘా వేసి ఉండవచ్చని వివిధ రకాల ఊహాగానాలతో కొన్ని నివేదికలు వెలువడ్డాయి.
కానీ... భూమి చాలా దూరంలో ఉన్న కారణంగా ఏ గ్రహాంతర వాసి కూడా ఇక్కడకు రాలేరని సౌథామ్ప్‌టన్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆప్ ఫిజిక్స్ మరియు ఆస్ట్రానమీ విభాగ నిపుణులు డా. క్రిస్టియన్ కైసర్ స్పష్టం చేశారు.
ఇటీవల అంతరిక్షంలో గ్రహాలను కనుగొనడం అద్భుతమైనదని వివరించారు. ఇతర గ్రహాల్లో కనుక జీవరాశి ఉన్నట్లు రూఢీ అయితే అదో పెద్ద శాస్త్రపరమైన ఆవిష్కరణ మాత్రమే కాదని... సామాజిక, రాజకీయ మరియు మతసంబంధమైన అంశాల్లో కూడా పెను మార్పులకు కారణమవుతుందని విశ్లేషించారు.
ఇటీవలి కాలంలో అనేక రకాల గ్రహాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాటిల్లో చాలా వరకు అత్యధిక ద్రవ్యరాశి కలిగి యున్నవేనని... కొన్ని మాత్రమే భూమిని పోలిన ద్రవ్యరాశి గల గ్రహాలు ఉన్నట్లు కైసర్ వెల్లడించారు. ఇతర గ్రహాలను భూమితో పోల్చి చూసేప్పుడు గట్టి నేలను కలిగి ఉండటం, అలాగే జీవరాశికి అనువైన వాతావరణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఏది ఏమైనప్పటికీ మన పాలపుంతలోని నక్షత్రాల మధ్య అనంతదూరం ఉంది. ఇన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఇతర గ్రహాల్లో జీవరాశి ఏర్పడలేదని చెప్పవచ్చు. ఒకవేళ అలాంటి జీవరాశి ఏదైనా ఉన్నట్లయితే ఈపాటికే భూమిమీద మనకు కనపడి ఉండేది. అని కైసర్ విశ్లేషించారు.
|