బహుశా పల్లె ప్రాంతాల్లో పాఠశాల స్థాయి విద్యాభ్యాసం చేసిన వారికి 'కప్పదాటు' ఆట జ్ఞాపకం ఉండే ఉంటుంది. స్కూలు వదిలిన తరువాత పిల్లలు ఇళ్ళకు వెళ్ళే సమయంలో కొంత దూరం వెళ్ళాక దారులు వేరవుతాయి. ఒకరిదేమో కప్పల దారిట... మరోకరిది చేపల దారిట ఇలా ఎన్నుకుంటారు.
తరువాత ప్రశ్న-సమాధానాలాటలో 'నా కప్పలన్నీ నీ చెరువులోకి- నీ చేపలన్నీ నా చెరువులోకి' అంటూ పరస్పరం మార్చుకుంటారు. చివరకు ఎవరి చెరువులోకి చేపలు చేరుతాయో వారు గెలిచినట్లు లెక్క. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం సరిగ్గా ఇలాంటి కప్పదాటు అటే దేశ నాయకత్వాన్ని నిర్ణయించనున్నది.
కేంద్రంలో తాజా రాజకీయాలు అన్ని పార్టీలకు తలనొప్పిగానే తయారయ్యాయి. పైకి ఎన్ని చెప్పినా లోపల అందరికి గుబులే. భావం.. భావజాలం కంటే పంతాలు పట్టింపులే ఎక్కువయ్యాయి. సరిగ్గా నాలుగేళ్ళ కిందట పూర్తి మద్దతు ప్రకటించి ప్రభుత్వ ఏర్పాటు సహకరించిన వామపక్షాలు అదే ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాయి.
ఇప్పటికే సంకీర్ణానికి మద్దతు ఉపసంహరించుకున్నాయి. ఫలితంగా మన్మోహన్ విశ్వాస పరీక్ష ఎదుర్కోక తప్పలేదు. ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు చేసేది అదీ ఎవరితోనో తెలుసా...! భావజాలంలో పూర్తిగా వైరుధ్యం కలిగిన భారతీయ జనతా పార్టీతో కలిసి(పరోక్షంగా) ఈ ప్రయత్నాలు సాగిస్తున్నారు.
అణు ఒప్పందంపై కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొడచూపిన అభిప్రాయభేదాలు ప్రభుత్వాన్ని కూలదోసే వరుకూ వెళ్ళాయి. అణు ఒప్పందంలో 123 దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసింది... కుదుపుతూ ఉంది... ఇదే అదునుగా భావించిన పలు పార్టీలు, ఎంపీలు ఎక్కడ అవకాశం వచ్చినా చక్రం తిప్పడానికో, డిమాండ్ల సాధనగా పావులు కదుపుతున్నారు.
|