ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం తీవ్రమవుతోంది. ప్రపంచ జనాభాలో సుమారు సగానికిపైగా అనగా 300 కోట్ల మంది ప్రజలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అలాగే ప్రతిరోజు 15,000 వేల మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో మృత్యువాతపడుతున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది.
ముఖ్యంగా గత పదేళ్లుగా వ్యవసాయ దిగుబడులు గణనీయంగా తగ్గిపోయినట్టు ఆ సర్వే పేర్కొంది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగించడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. అయితే ఆధునిక వ్యవసాయ పద్దతుల మూలంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ అవి ప్రపంచ జనాభా అవసరానికి ఏమాత్రం సరిపోవడం లేదు.
అగ్రి బిజినెస్ వంటి సంస్థలు ఆహార ధాన్యాల ఉత్పత్తిపై దృష్టి సారించినప్పటికీ.. దిశా నిర్ధేశం లేని మార్కెటింగ్ విధానాల వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. గత ఏడాదికి ప్రస్తుతానికి పోల్చి చూడగా బియ్యం ధరలు 215 శాతం మేరకు పెరగగా, గోధుమల ధర 83 శాతం మేరకు పెరిగినట్టు ఐరాస సర్వే తేల్చి చెప్పింది.
ఇదే పరిస్థితి భవిష్యత్‌లో కొనసాగిన పక్షంలో ప్రపంచంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఆహార ధాన్యాలు అందక పోవచ్చని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు మేల్కొని ఆహార సంక్షోభం నివృత్తి కోసం తగిన చర్యలు చేపట్టాలని ఐరాస కోరుతోంది.
|