గర్భస్రావం చేసుకోవడానికి అనుమతి కోరుతూ కోర్టు కెక్కిన ఓ మహిళ అభ్యర్ధనను ముంబయి హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో చేసిన చట్టాలను తాము ప్రస్తుతం మార్చబోమని... అందుకే గర్భస్రావానికి తాము అనుమతించబోమని కోర్టు పేర్కొనడం గమనార్హం.
తన కడుపులో పెరుగుతున్న శిశువుకు తీవ్రమైన గుండెలోపం ఉందని దానివల్ల బిడ్డ జన్మిస్తే భవిష్యత్‌లో బిడ్డకు అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున గర్భస్రావానికి అనుమతించాలంటూ ముంబయికి చెందిన నికితా మెహతా అనే మహిళ కోర్టును అభ్యర్థించారు.
నికిత పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం 20 వారాలు దాటిన గర్భస్థ శిశవు వల్ల తల్లి ప్రాణాలకు ముప్పు ఉందని తేలిన సమయంలోనే గర్భస్రావానికి అనుమతి లభిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
అదేసమయంలో బిడ్డకున్న లోపాల వల్ల ఆ బిడ్డకు చిన్నపాటి సమస్యలున్నాయన్న కారణంపై గర్భస్రావానికి చట్టం అనుమతించదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ సమయంలో గర్భస్థ శిశువు పరిస్థితిపై డాక్టర్లు ఇచ్చిన నివేదికను కోర్టు పరిగణలోకి తీసుకుంది.
దీనిప్రకారం బిడ్డ తీవ్రమైన అంగ వైకల్యంతో జన్మించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందున నిఖిత విషయంలో గర్భస్రావానికి అనుమతించే ప్రసక్తే లేదని కోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ ఆర్.ఎం.ఎస్.ఖండేపార్కర్, జస్టీస్ అంజాద సయ్యద్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
|