ఆరోగ్య జాగ్రత్తల నిమిత్తం కావలసిన మౌలికసదుపాయాల సమీకరణ లక్ష్యంతో ప్రభుత్వం... ఆరోగ్య రంగంలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తోంది. అందుకోసం ఇప్పటికే ప్రవేశపెట్టబడిన నియంత్రణల పరిధిని కొంత మేర సడలించి తద్వారా ప్రైవేటు సంస్థల ప్రవేశానికి వీలుకల్పించాలని చూస్తోంది.
న్యూఢిల్లీలో జరిగిన ఆరోగ్య సంబంధిత కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆరోగ్య కార్యదర్శి నరేష్ దయాల్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందు కోసం, కార్పొరేట్ సంస్థల ప్రవేశాన్ని ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలోని ప్రభుత్వ ఆసుపత్రులను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆసక్తిని కనబరుస్తోందని అన్నారు. అలాగే ఈ భాగస్వమ్యంతో ఆరోగ్య రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించవచ్చని ప్రభుత్వం విశ్వసిస్తున్నట్లు నరేష్ వ్యాఖ్యానించారు.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, ఇండియన్ డెంటల్ కౌన్సిల్ మరియు ఇండియన్ ఫార్మాకాలజీ కౌన్సిల్ సంస్థల నుంచి కచ్చితమై సలహాలు జారీచేయబడ్డాయని తెలిపారు. వారిచ్చిన సలహాల్లో ఒకటి ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ లేక లాభేతర సంస్థ ఆరోగ్య విద్యా కేంద్రాన్ని నెలకొల్పాలని సూచించినట్లు నరేష్ వివరించారు.
ఈ పరిణామం ప్రముఖ ఆరోగ్య సంస్థ దిగ్గజాలైన ఫోర్టిస్ హెల్త్‌కేర్, అప్పోలో హాస్పిటల్స్ మరియు హిందూజా గ్రూప్‌లకు ఎంతో ఉపయోగకరమైనదిగా నరేష్ అభిప్రాయపడ్డారు. పైగా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకునే సంస్థలకు ఈ పరిణామం శుభసూచకంగా వర్ణించారు. కాగా, ఫోర్టిస్ ఇప్పటికి రూ. 800 కోట్ల పెట్టుబడితో 10 మెడిసిటీస్‌లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇదంతా ఒకెత్తయితే... మరోవైపు తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం భారత్‌లో ప్రతి వెయ్యి మంది రోగులకు కేవలం 0.86 బెడ్ సౌకర్యాలు మాత్రమే కలిగి ఉండటం మన దయనీయ పరిస్థితికి దర్పణం పడుతుంది. అదీకాకండా ప్రపంచంలోనే ఈ సంఖ్య అత్యంత కనిష్టం అని తాజాగ నివేదికలు తేటతెల్లం చేస్తుండటం దురదృష్టకరం.
ఇక 2007లో ప్రణాళిక సంఘం విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్‌లో ఆరు లక్షల మంది వైద్యులు, 10లక్షల మంది నర్సులు, రెండు లక్షల మంది దంత నిపుణులు ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)పై ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్ మోంటెక్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ-ప్రవేటు భాగస్వామ్యంతో ఇప్పటికే ఉన్న మౌలికసదుపాయాల్లో వృద్ధి చెంది అవసరమైన మేరకు అందుబాటులోకి రాగలవని విశ్లేషించారు.
ఆరోగ్య పరిరక్షణా సేవలను వేగవంతం చేయడమే కాకుండా ప్రభుత్వాసుపత్రుల సామర్థ్యాన్ని త్వరిత గతిన పుంజుకుని పోటీని తీసుకురాగల స్థాయికి ప్రభుత్వాసుపత్రులు ఎదుగుతాయని సింగ్ అభిప్రాయపడ్డారు. మరో పేద ప్రజల కోసం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఆరోగ్య రంగంలో కీలక పాత్ర వహిస్తోందని తెలిపారు. అలాగే మరో 3 నుంచి నాలుగేళ్లలో ఈ పథకం ప్రభావం గణనీయంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు సింగ్ వ్యాఖ్యానించారు.
|