పాకిస్థాన్ దేశ రాజకీయాలు ఎపుడు ఎలా మలుపు తిరుగుతాయో ఎవరికీ అంతుచిక్కవు. స్వయానా పాకిస్థాన్ దేశ ప్రజలకు కూడా. ఎందుకంటే.. ఒకనాడు అవినీతికి మూలపురుషులుగా వెలుగొందిన నేతలు.. కాలక్రమంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇలాంటి సంఘటనలు గతంలోను.. ఇపుడూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
తాజాగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కొ-ఛైర్మన్‌గా ఉన్న ఆసిఫ్ అలీ జర్దారీ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఇందుకు ఉదాహరణ. పాక్ రాజకీయ వర్గాల్లో ఆయన ముద్దుపేరు ‘మిస్టర్ టెన్‌పర్సెంట్’. అవినీతి ఆరోపణలు ఆయన ఇంటిపేరు. వాటి కారణంగానే 11 ఏళ్ల పాటు ఆయన జైలు జీవితం గడిపారు. భార్య బెనజీర్ భుట్టో అధికారంలో ఉన్నంతకాలం ఆమెకు వెన్నంటి నీడలా ఉన్నారు.
బెనజీర్ హత్యానంతరం జర్దారీ పాక్ రాజకీయాల్లో మెరుపులా మెరిశారు. గతాన్ని మరిపిస్తూ... ఏకంగా దేశాధ్యక్ష పదవిని చేపట్టారు. అగ్రరాజ్యం అమెరికాకు నమ్మినబంటుగా పేరొందిన పాక్.. ప్రపంచంలోనే ఏకైక ఇస్లామిక్ అణ్వాయుధ రాజ్యంగా పేరొందింది. అలాంటి దేశానికి 53 ఏళ్ల జర్దారీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
పాక్ మాజీ ప్రధాని, దివంగత బేనజీర్ భుట్టోను వివాహం చేసుకోక మునుపు జర్దారీ ఒక సాదాసీదా వ్యాపారవేత్త. భుట్టోను వివాహమాడేంత వరకు ఆయన పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ... పాకిస్థాన్‌లోనే తొలి రాజకీయ కుటుంబమైన భుట్టో వారసురాలిని 1987లో వివాహం చేసుకున్నారు.
దీంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. 1990-96 మధ్య కాలంలో ఆయన జాతీయ అసెంబ్లీ, పార్లమెంటు దిగువ సభల సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1993-96 మధ్య కాలంలో ఆ దేశ పర్యావరణ మంత్రిగా, 1995-96లో పెట్టుబడుల మంత్రిగా వ్యవహరించారు. 1997-99 మధ్య సెనేటర్‌గా ఉన్నారు.
|