అస్సాం చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన 13 వరుస బాంబు పేలుడు ఘటనల్లో మృతుల సంఖ్య 66కు పెరగగా 470 మందికి పైగా గాయపడ్డారని రాష్ట్రముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ ప్రకటించారు. రాజధాని గౌహతిలో జరిగిన 6 పేలుళ్లలో రెండు చోట్ల ఆర్డీఎక్స్ ఉపయోగించారని తెలిపారు. ఈ పేలుళ్ల వెనుక కుట్ర ఛేదించడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పర్చామని చెప్పారు. | | అస్సాం పేలుళ్లు దేశ అంతర్గత భద్రతపై ప్రజల విశ్వాసాన్ని ఒక్కసారిగా చెదరగొట్టేశాయి. కోల్పోయిన మనుషుల ప్రాణాలకంటే.. వందలాది బాధితుల గాయాల కంటే... ప్రభుత్వాల పనితనం పట్ల ప్రజల మనసుల్లో ఉన్న విశ్వాసాన్ని ఈ దాడులు ఘోరంగా దెబ్బతీశాయి. |
| |
అత్యంత భద్రత కలిగిన రాష్ట్ర శాసన సభా భవనానికి సమీపంలోని గణేష్‌గౌరి ఫ్లైఓవర్‌తో సహా నగరంలో నిత్యం రద్దీగా ఉండే చోట్ల తీవ్రవాదులు దుస్సాహసిక దాడులకు పాల్పడంతో దేశం దిగ్భ్రాంతి చెందింది. బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే హుజి తీవ్రవాద సంస్థ సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 11 గంటల 30 నిమిషాల మధ్యలో జరిగిన ఈ భారీ పేలుళ్లు దేశ భద్రతా దళాల నిఘాపై ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశాయి. రాజధానీ నగరంలోనే కాక దిగువ అస్సాంలోని కోక్రాజార్, బోంగైగావ్, బార్పేట వంటి జిల్లాకేంద్రాల్లో కూడా తీవ్రవాదులు బాంబులు పేల్చి ప్రభుత్వ యంత్రాంగానికి పెను సవాలు విసిరారు.చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా దాడుల తర్వాత రాష్ట్ర వ్యాపితంగా అప్రమత్తత ప్రకటించడం... పలు ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు జరపడం... గౌహతిలో 144 సెక్షన్.. తర్వాత కర్ఫ్యూ ప్రకటించటం. అస్సాం-మేఘాలయ సరిహద్దు పొడవునా భద్రత పెంచడం, ఇండో బంగ్లా సరిహద్దు మూసివేయడం... ఈశాన్య భారత రీజియన్ మొత్తంగా భద్రతా దళాలు అప్రమత్తం కావడం... షరా మామూలే.ఈ చర్యలు మొత్తంగా పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేవు. గాయపడిన వందలాది మంది బాధితుల మానసిక గాయాలను మాన్పలేవు. అన్నిటి కంటే మించి విభిన్న మతాల ప్రజల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న పరస్పర అవిశ్వాసాన్ని, విద్వేష భావాలను రూపుమాపలేవు. ఒక్కమాటలో చెప్పాలంటే కేవలం 15 నిమిషాల వ్యవధిలో రాష్ట్రమంతటా సంభవించిన ఈ పేలుళ్లు దేశ అంతర్గత భద్రతపై ప్రజల విశ్వాసాన్ని ఒక్కసారిగా చెదరగొట్టేశాయి. కోల్పోయిన మనుషుల ప్రాణాలకంటే.. వందలాది బాధితుల గాయాల కంటే ప్రజల మనసుల్లో ప్రభుత్వాల పనితనం పట్ల విశ్వాసాన్ని ఈ దాడులు ఘోరంగా దెబ్బతీశాయి. ఫలితం వెంటనే కనిపించిది కూడా... 13 చోట్ల పూలగుత్తులు పెట్టినంత సులభంగా తీవ్రవాదులు రద్దీప్రాంతాల్లోనే బాంబులను అమర్చుతుంటే కనీసం ఒక సందర్భంలోనూ పసిగట్టలేని పోలీసు యంత్రాగం అసమర్థతపై ప్రజలు ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. పేలుళ్లు జరిగిన క్షణాల్లోనే గౌహతిలో జనం గుంపులు గుంపులుగా తరలివచ్చి అగ్నిమాపకదళ సభ్యులపై, పోలీసులపై, అధికారుల వాహనాలపై దాడులకు దిగారు. కనిపించిన ప్రతి ప్రభుత్వ అధికార బృందాలపై రాళ్లు విసిరారు. చివరకు కట్టలు తెంచుకున్న కోపంతో జనం గాయపడిన వారిని మోసుకుపోవడానికి వచ్చిన అంబులెన్స్‌లను కూడా వదలకుండా రాళ్ల వర్షం కురిపించారు.ప్రాణాలు తీయడంలో కాదు... వందలమందిని గాయపర్చడంలో కాదు... ప్రభుత్వాల చేతకానితనానికి నిరసనగా ప్రజలు సహజ ప్రేరణతో తిరుగబడేలా చేయడంలో తీవ్రవాదులు నూటికి నూరు శాతం విజయం సాధించారు. ఇది దేశానికి, ప్రభుత్వ యంత్రాంగానికి, అంతర్గత భద్రతకు ఏ మాత్రం మంచిది కాదు. అస్సాం పేలుళ్ల వెనుక పేరుకు పోయిన అత్యంత విషాదం ఇదే మరి. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |