ముంబై దాడులు జరిగి సరిగ్గా నెల రోజులు గడిచాయి. నవంబర్ 26 రాత్రి ఉగ్రవాద చర్యలను అరికట్టడంలో భారత్ అసమర్థత, వ్యవస్థాగత లోపాలు ప్రపంచం ముందు ముసుగుల్లేకుండా వెల్లడయ్యాయి. వాళ్లు.. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదులా.. లేదా పాక్ సైన్యం మద్దతు ఉన్న ఉగ్రవాద బృందాలా.. ఇప్పుడు మనం ఏ పేరుతో అయినా పిలవవచ్చు. ఎవరైతైనేం.. వాళ్లు వచ్చారు. వందల కిలోమీటర్లు ప్రయాణించి భారత సముద్ర తీరంలో హాయిగా ఆడుకుని కులాసాగా, క్షేమంగా, ఎలాంటి అడ్డంకులూ లేకుండా ఇండియాగేట్ ద్వారా రాజసంగా నగరంలోకి నడుచుకుంటూ వచ్చారు. తర్వాత ముంబై నగరంలో జరిగిందేమిటో ప్రపంచానికే తెలుసు. | | ప్రభుత్వాలకు సాధ్యం కాని, సకాలంలో దేశ రక్షణ బలగాలకు సాధ్యం కాని ఈ పరిణామం ఎలా సాధ్యమైంది? ఉగ్రవాదులు హద్దుమీరి ముంబైలో సాగించిన రాక్షస కాండ దేశ ప్రజల్లో ఎన్నడూ లేనంత ఐక్యతను తీసుకొచ్చింది. |
| |
అతి భయంకరమైన మారణాయుధాలను ధరించి సముద్రతీరం నుంచి మన రక్షణ పాటవాన్ని అపహసిస్తూ నగరంలోకి అడుగు పెట్టిన 10 మందితో కూడిన మూక దాదాపు 60 గంటలపాటు ముంబై నగరాన్ని వణికించింది. ఇంత నిర్భీతిగా, క్రూరంగా, లక్ష్యంపై గురి తప్ప మరేదీ పట్టించుకోనంత పైశాచికంగా ఓ పది మంది ముష్కరులు చేసిన దాడితో యావత్ జాతి గాయపడింది. అవమానపడింది.ఈ దారుణ ఘటనలో ఉగ్రవాదులు సాధించిన తొలి విజయం కంటే మిన్నగా మన అన్ని వ్యవస్థల వైఫల్యం భారత ప్రజానీకాన్ని దహించివేసింది. స్వాతంత్ర్యం తర్వాత జాతి మొత్తంగా ఇంతగా బయటి శక్తులచే అవమానానికి గురైన సంఘటన మరొకటి లేదంటే ఆశ్చర్యం లేదు. చివరకు పార్లమెంటుపై దాడి సందర్భంగా కూడా భారత్ ఇంతగా స్పందించినట్లు లేదు.ఈ దారుణ ఘటనలో భారత్ రెండు రకాలుగా అవమానాల పాలైంది. ఒకవైపు ముష్కరుల దుష్ట పన్నాగాలకు భారత్ బలికావడం ద్వారా, మరో వైపున నేర సమానమైన వ్యవస్థ పరమ నిర్లక్ష్య వైఖరి వల్ల కూడా గాయపడింది. ఉగ్రవాదుల దాడుల హెచ్చరికలకు తగువిధంగా స్పందించక పోవడం... ప్రజల కనీస భద్రతకు హామీ పడేలా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో మన దేశ అధికార వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం.. బాహ్య, అంతర్గత భద్రతా వ్యవస్థకు చెందిన మౌలిక చట్రం పనికిమాలిన విధంగా తయారై పాతబడిపోవడం.. ఒకటేమిటి అన్నిరకాలుగా భారత్ పరాభవానికి గురైంది. శత్రువు కెలికిన గాయాలకు తోడుగా మన చేతకానితనం, రక్షణ పరంగా దుర్భరత్వం రేపిన గాయాలతో భారత్ మూగబోయింది.ఉగ్రవాదులు దాడి మొదలెట్టిన సమయంలో ఒక్క క్షణంపాటు కుదుపు.. అంతే తర్వాత చూస్తే కేవలం పది మంది ఉగ్రవాదులు.. భారత్‌కు చెందిన అత్యున్నత బలగాలను 60 గంటల పాటు నిలువరించారు. అలాగని దాడులు మనకు కొత్త కాదు. ప్రపంచంలో ఉగ్రవాదం బారిన పడిన అత్యంత బాధిత దేశాల్లో భారత్ ఒకటి. అయినప్పటికీ దాడి జరిగిన తొలి గంటల్లో శత్రువునుంచి చొరవను చేజిక్కించుకోవడానికి తగిన వ్యూహం మన వద్ద లేకపోయింది. ముంబైలో జరుగుతున్న విధ్వంసక పరిణామాలను 24 ఇంటూ సెవన్ ఛానెళ్ల ప్రసారాల సాక్షిగా ప్రపంచం మూగవోయి చూస్తూంటే వర్ధమాన ప్రపంచ శక్తిగా పేరొందిన భారత్ చేష్ట్యలుడిగిన రీతిలో తేలిపోయింది. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఎలాంటి దాడిలో అయినా, ఎలాంటి యుద్ధ రీతిలో అయినా సరే... తొలి దాడి చేసిన పక్షానికి ప్రారంభ విజయం దక్కుతుందనేది సత్యమే.. ఫలానా కోణంలో జరుగుతుందని ఊహించడానికి కూడా వీలులేనంతగా జరిపే మెరుపు దాడులలో చొరవ, తొలి ఫలితం దాడికి దిగిన వారికే దక్కుతుందనేది సైనిక పరమైన వాస్తవం కావచ్చు.కానీ దాడి జరిగిన పది గంటల తర్వాత సుశిక్షితులైన కమేండోలు ముంబై నగరాన్ని చేరుకోగలిగారంటే, అంతవరకు టెర్రరిస్టులు ఆడింది ఆట పాడింది పాటగా ముంబైలో చెలరేగిపోయారంటే ఇందుకు ఎవరు ఎవరిని తప్పు పట్టాలి. ఇక్కడే జాతి గాయపడింది. ఘోరంగా అవమానించబడింది. |