విద్యుత్ సమస్య తలెత్తితే భారత్‌లో అయినా అమెరికాలో అయినా ప్రజలు చీకటిలో మగ్గాల్సి రావడం సహజమే కావచ్చు. కాని సాక్షాత్తూ కాబోయే అమెరికా అధ్యక్షుడు ఒబామా బరాక్ సైతం కరెంట్ సమస్యలో చిక్కుకుని 12 గంటలపాటు చీకటిలో మగ్గవలసి వస్తే... అంత గొప్ప అమెరికాకు సైతం విద్యుత్ బాధలు తప్పవని ఈ ఘటన తెలుపుతోంది. అమెరికా నూతన అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టేలోపుగా 20 రోజుల పాటు కుటుంబంతో సరదాగా గడుపుదామని హవాయి దీవులకు వచ్చిన బరాక్ ఒబామా కుటుంబానికి విద్యుత్ సమస్యలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా బోధపడింది. హవాయి దీవుల్లో బీచ్‌లో అర్ధనగ్నంగా కనపడి ఫోటోకెక్కిన ఒబామా మరో వింత అనుభవాన్ని కూడా చవిచూడవలసి వచ్చింది. సరదాగా గడుపుదామని కుటుంబంతో వచ్చిన ఒబామాకు హవాయిలో విద్యుత్ సమస్యకూడా తానున్నానంటూ ఎదురయింది మరి. హవాయి దీవుల్లో అనుకోకుండా విద్యుత్ సమస్యలు తలెత్తడంతో గత శుక్రవారం రాత్రి మొత్తంగా ఓహియోలోని విడిది కేంద్రంలో ఒబామా తన భార్య మిచెల్, ఇద్దరు పిల్లలతో చీకట్లోనే గడిపారు. ఇక్కడే ఈ నల్లజాతి వజ్రం గొప్పతనం ప్రపంచానికి బోధపడుతుంది. పది నిమిషాలు కరెంట్ పోయి రాకుంటే మన ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతులు అయినా సరే ఎంత హంగామా చేయగలరో, కరెంటోళ్లను ఎంతలా గజగజలాడించగలరో మనకు తెలుసు. అలాంటిది కాబోయే అధ్యక్షులవారు చీకట్లో మగ్గుతున్నారనే విషయం తెలిసిన వెంటనే హవాయి గవర్నర్, హోనోలులు మేయర్‌లు వెంటనే ఒబామా విడిది గృహానికి జనరేటర్లు సమకూర్చేందుకు ముందుకు వచ్చారు. అయితే ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్న ఒబామా కుటుంబం జనరేటర్లను అమర్చే ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిందని ఒబామా ప్రతినిధి బెన్ లాబోల్డ్ తెలిపారు. అసలు విషయం ఏమిటంటే విద్యుత్ అంతరాయంతో హవాయి దీవుల్లోని పలు పట్టణాలలో దాదాపు 9 లక్షలమంది ప్రజలు శుక్రవారం రాత్రి పొడవునా చీకట్లోనే మగ్గిపోయారు. లక్షలాది మందికి కూడా తమతో పాటుగా కరెంట్ లేదని సూచనప్రాయంగా అర్థం చేసుకున్నందుకే కాబోలు ఒబామా కుటుంబం తమ కోసం ప్రత్యేకంగా జనరేటర్ల అమర్పును తిరస్కరించింది. బాల్యంలో దుర్బర దారిద్ర్యం అనుభవించిన ఒబామా కాళ్లు ఇంకా నేలమీదే ఉన్నాయనడానికి ఇదొక తిరుగులేని దాఖలా. ఒక సామూహిక కష్టాన్ని ఎదుర్కొనడానికి ప్రత్యేక సౌకర్యాలను వదులుకున్న ధీరోదాత్తత ఒబామాకే సొంతం. ఒక గంట కాదు రెండు గంటలు కాదు... దాదాపు 12 గంటల పాటు నిశీధిలో కాబోయే అమెరికా అధ్యక్షుడి కుటుంబం గడపటం.. ఇది చాలా చిన్న సంఘటనే కావచ్చు. కాని ఎవరికి వారు దీన్ని తమకు తాము వర్తింపజేసుకుంటే... |