తమకంటే ఉన్నతమైన జీవితాన్ని గడుపుతుండేవారిని చూసి అవతలివారు ఈర్ష్యపడటం సహజమే. అలాంటిది మరణం విషయంలో కూడా ఈర్ష్యపడటం అనేది వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నప్పటికీ... ఇతరులు అసూయపడేలా తన భర్త వీరమరణం పొందారని... ఏటీఎస్ ఎస్ చీఫ్ హేమంత్ కర్కరే సతీమణి కవితా కర్కరే గర్వంగా చెబుతున్నారు.ముంబయిలో ఉగ్రవాదుల దాడిలో... కర్కరే మరణించిన నెల రోజుల తరువాత మౌనం వీడిన కవిత... పలు టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోభావాలను చెమ్మగిల్లిన కళ్లతో పంచుకున్నారు. ఆయన లేని తాను ప్రతిరోజూ నరకయాతన అనుభవిస్తున్నాననీ, తనకు తన భర్త కావాలని, తండ్రి కోసం పిల్లలు వెక్కి వెక్కి ఏడుస్తున్నారంటూ భోరున విలపించింది.తన భర్త త్యాగం తనకెంతగానో గర్వకారణమేగానీ, యాభై ఏళ్ల వయసున్న తనకు భర్త తోడు చాలా అవసరమని చెబుతూ కవిత విలపించింది. పెళ్ళైన తన పెద్దకూతురిని ఓదార్చేందుకు ఆమెకూ ఓ కుటుంబం ఉంది. కానీ లండన్‌లో చదువుకుంటున్న తన చిన్నకూతురు, కొడుకులను తలచుకుంటేనే గుండె చెరువవుతుందంటూ వాపోయారు.ఆయన పోయిన మొదటి నెల తమ బాధ అంతా ఇంతా కాదనీ, రాత్రిళ్లు పిల్లలు ఏడ్చేవారనీ, ఆవేశంతో ఊగిపోయేవారనీ... అప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి తనదని కవిత కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఎంతో సాహసం, ధైర్యంగలిగిన తన భర్త ఎంత సమస్యనైనా ముందుండి ఎదుర్కొంటారనీ తెలుసు. అయినప్పటికీ... ఆయన ఏటీఎస్‌లో చేరినప్పుడు తానెంతగానో భయపడ్డాననీ, ఐరాస ఉద్యోగానికి దరఖాస్తు చేయమని పలుసార్లు ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆయన వినలేదని ఆమె చెప్పారు.పోలీసులకు అధునాతన ఆయుధాలు, రక్షణ కవచాలు ఉండి ఉంటే.. తన భర్త బ్రతికేవారని చెప్పిన కవిత.. ఇప్పటికైనా పోలీసులకు అధునాతన ఆయుధాలు, సరైన రక్షణ కవచాలను అందజేయాలని కోరారు. ఉగ్రవాది కసబ్ తప్పు తెలుసుకుని మారే అవకాశాన్నివ్వాలని తన చిన్న కూతురు కోరుతోందని ఈ సందర్భంగా కవితా కర్కరే తన అభిప్రాయం వెల్లడించారు.ఇదిలా ఉంటే... గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రకటించిన కోటి రూపాయల నష్టపరిహారాన్ని సైతం నిరాకరించిన కవితా కర్కరే... దేశం కోసం ప్రాణాలర్పించిన తన భర్తకు పరిహారం ఇవ్వాలనుకోవడం, దాన్ని తాను స్వీకరించటం సుతరామూ ఇష్టం లేదని తిప్పికొట్టి... భర్తకు తగిన భార్య అనిపించుకున్నారు. |