గురువారం వైకుంఠవాసునికి మరో వజ్రఖచిత కిరీటం అందింది. 45 కోట్ల రూపాయల విలువైన ఈ వజ్ర కిరీటాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి గాలి జనార్ధన రెడ్డి గురువారం కానుకగా అందజేశారు. కోరిన కోర్కెలు తీర్చిన వేంకటేశునికి ఎంత ఇచ్చినా చాలదనీ బ్రాహ్మిణి స్టీల్ పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ కూడా అయిన జనార్ధన రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు... ఆ కలియుగ దైవానికి ఉన్న శక్తి ఎంతటిదో తెలియజేస్తాయి. ఏడుకొండలవాడిని రెప్పపాటు దర్శించుకుని తమ వేదనను, బాధలను బాపుమని అడిగేందుకు గంటలు కాదు, రోజులపాటు ఆ తిరుమల కొండల్లో భక్తజనకోటి నిరీక్షిస్తోందంటే, తిరుమలేశుని వీక్షణ ఫలం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. శ్రీ వేంకటేశ్వరుని కరుణాకటాక్ష వీక్షణాలకోసం పరితపించనివారు ఈ భూ ప్రపంచంలో లేరంటే అతిశయోక్తి కాదేమో. ఆ దేవదేవుని మదిలో తలచుకుని మొదలుపెట్టిన కార్యం శుభకరమవుతుందన్న అపార విశ్వాసం అశేష భక్తుల మనసులో గూడుకట్టుకుని ఉంది. అందువల్లనే కలియుగదైవాన్ని నిత్యం లక్షల భక్తులు దర్శించుకుని వెళుతుంటారు. గోవిందుని దర్శనభాగ్యం కలిగాక తమతో తెచ్చుకున్న కానుకలను శ్రీవారికి సమర్పిస్తారు భక్తులు. ఈ కానుకలలో చిరు కానుకల నుంచి కోట్ల విలువచేసే వజ్రవైఢూర్యాలు కూడా ఉంటాయి. ఈ కానుకలన్నీ ఎందుకు...? అనే సందేహానికి ఒక్కో భక్తుని వద్ద ఒక్కో సమాధానం ఉంటుంది. ఆ సమాధానాలన్నీ క్రోఢీకరించి చూస్తే... ప్రతి సమాధానం వెనుక ఒక సమస్య. ఆ సమస్యను కలియుగ దైవం కరుణ వల్ల అధిగమించామనే భావన. ఆ భావనలోనే నిత్యం "గోవింద... గోవింద.." నామజపం. ఆ నామజపంతోనే ఏడుకొండలవాడిని వీక్షించుకుని కరుణకు పాత్రులవ్వాలనే ఆత్రుత... అదే ఆత్రుత పుట్టిన ప్రతి బిడ్డడదీ. అందుకే ఆ తిరుమలేశునికి ఎప్పటికీ మనం ఋణగ్రస్తులమే. |