గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం, ఆ తర్వాత జరుగుతున్న వరుస సంఘటనలను చూస్తుంటే కేసీఆర్‌కు పదవీ గండం తప్పదేమో అనిపిస్తోంది. ఒకవైపు స్వపక్షంలోనే లుకలుకలు ఉన్నట్లు ఆ పార్టీలోని కొందరి నాయకుల వ్యవహార శైలి బట్టబయలు చేస్తుంటే, మరోవైపు కేసీఆర్ నగరంలో ఉన్నప్పటికీ ఆయనను తోసిరాజని పలువురు నేతలు గ్రేటర్ ఎన్నికలపై "రాములమ్మ" విజయశాంతితో సంప్రదింపులు జరుపుతూ కేసీఆర్‌కు కునుకు లేకుండా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇవన్నీ ఇలా ఉంటే మొన్నటి అసెంబ్లీ సమావేశాలలో కేసీఆరే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విరుచుకుపడ్డారు. అంతటితో ఆగక ఆ వేడిని కాంగ్రెస్ నాయకులు కొనసాగిస్తూనే ఉన్నారు. తెలంగాణా ఉద్యమాన్ని నిర్వీర్యం చేసిన తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖరరావు తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ నాయకుడు సంతోష్ రెడ్డి శుక్రవారం డిమాండ్ చేయడం ఇందులో భాగమే.సంతోష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణా తెస్తామని ప్రతిసారి ప్రజల జీవితాలతో ఆడుకోవడం చంద్రశేఖరరావుకు అలవాటైపోయిందని దుయ్యబట్టారు. తెలంగాణా గుండెను గాయపరిచిన కేసీఆర్ ఒక్క క్షణం కూడా తెరాసకు అధ్యక్షునిగా కొనసాగే అర్హత లేదని ధ్వజమెత్తారు.ఇలా కాంగ్రెస్ మాటల బాణాలు, మరోవైపు తెరాసలోని దిగువ శ్రేణి నాయకుల కేసీఆర్ వ్యతిరేక వ్యవహార శైలి తెరాస చీఫ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు సమాచారం. అయితే తమ పార్టీలో ఎటువంటి లుకలుకలు లేవని తెరాస ఎంపీ విజయశాంతి ఎప్పటికప్పుడూ చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు. ఇదిలావుంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కూటమిగా ఏర్పాటు కావడం వల్లనే తమకు పీఠం దక్కలేదని, అందువల్ల గ్రేటర్ ఎన్నికలలో తాము ఒంటరిగా బరిలోకి దిగుతున్నామని తెలుగుదేశం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండంకెల అసెంబ్లీ స్థానాలతో బిక్కుబిక్కుమంటున్న తెరాస, గ్రేటర్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఫలితాలు వ్యతిరేకంగా వస్తే కేసీఆర్ పదవీగండం మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నట్లు భోగట్టా. అంటే.. తెరాసా చీఫ్ పదవి గ్రేటర్‌తో ముడిపడి ఉందని అనుకోవచ్చన్నమాట. |