జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీకి యువరాజుగా భాసిల్లుతున్న రాహుల్ గాంధీ శుక్రవారం నాటితో 39వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో విద్యార్థినీ, విద్యార్థులకు ఆంగ్లంలో వక్తృత్వ, వ్యాస రచన, పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు ఆ పార్టీ అధినాయకుల చేతులమీదుగా బహుమతులు అందజేశారు. ఆ తర్వాత కార్యకర్తలను రాహుల్ గురించి స్పందించాల్సిందిగా కోరినప్పుడు...పలువురు కార్యకర్తలు ఇలా స్పందించారు...రాహుల్ తమ యువనేత అని, అతనే భారతదేశ భావి ప్రధాని అని ఓ మహిళా కార్యకర్త అభిప్రాయపడ్డారు. అలాగే అతను ముందు పెళ్ళి చేసుకుని ఆ తర్వాతే ప్రధాని పదవిని అలంకరించాలనికూడా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మరో కార్యకర్త ప్రేమ్ కుమార్ స్పందిస్తూ...రాహుల్ తన తండ్రిలాగా ప్రజలలోకి దూసుకుపోయే స్వభావం కలిగినవాడని, ప్రజల కష్టాలు అతనికి బాగా తెలుసునని, ప్రజల కష్టాలను తొలగించేందుకు తమ యువ నేత రాహుల్ నిత్యం శ్రమిస్తారని, దేశాన్ని అభివృద్ధిపథంవైపు తీసుకువెళ్ళే సామర్థ్యం అతనిలో ఉందని ప్రేమ్ అభిప్రాయపడ్డారు. కాగా రాహుల్ వివాహం గురించి ప్రస్తావిస్తూ... తమ పార్టీ ప్రిన్స్ రాహుల్ మనసును ఎవరు దోచుకుంటారో వేచి చూడాల్సిందేనని, కాని ముందుగా వివాహం చేసుకుని ఆ తర్వాతే అతను ప్రధాని పదవిని అలంకరించాలని ఆ కార్యకర్త తన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇదండీ! ఇలా దేశవ్యాప్తంగా చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. కాబట్టి మనందరం రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పనిలో పనిగా మనం కూడా "శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు" అందామా...! |