| | అంతా భ్రాంతియేనా.. కేసీఆర్ వైఖరి ఇంతేనా! | | | | | సోమవారం, 22 జూన్ 2009( 17:29 IST ) | | | | | | |
| | |
| కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజీనామా వ్యవహారంలో అందరూ ఊహించిందే జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి తనను బాధ్యుడిని చేస్తూ అసమ్మతి, తిరుగుబాటు నేతలు చేసిన విమర్శలతో కలత చెంది, అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఈ రాజీనామా, ఉపసంహరణ ఘట్టాలపై తెరాస నేతలు హైడ్రామా సాగించారు. ఒకవైపు కార్యకర్తలతో ఆందోళనలు చేయిస్తూ, మరోవైపు.. అసమ్మతి నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సంఘటనలతో రాజీనామా డ్రామా మరింత రక్తి కట్టింది. రెండు గంటల సినిమాలాగానే.. కేసీఆర్ రాజీనామా కూడా రెండు రోజుల ఉత్కంఠతలా మారింది. చివరకు... ఆయనకు ఆయనే సర్ధి చెప్పుకుని.. సమర్థించుకున్నారు. నెపం మాత్రం అసమ్మతి, తిరుగుబాటు నేతలపై నెట్టి రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. తనలాంటి ఉద్యమ నేత తెరాసలో లేరే లేరని, తెలంగాణా ఉద్యమానికి తాను మినహా మరెవ్వరూ నాయకత్వం వహించలేరని జబ్బలు చరచుకున్నారు. మొత్తమ్మీద శనివారం నుంచి ఆదివారం రాత్రి దాకా కొనసాగిన "రాజీ"(నామా) హై డ్రామాకు తెరపడింది. గతంలో ఉప ఎన్నికల సందర్భంగా చేసినట్టే కేసీఆర్ ముందు పదవికి రాజీనామా చేసి, ఒకటి, రెండు రోజులు అందరినీ ఉత్కంఠతో ముంచెత్తిన తరహాలోనే ఈ దఫా కూడా రాజీనామా డ్రామా సాగింది. అయితే, అసమ్మతి గళం, ప్రతిపక్ష నేతలు, తిరుగుబాటు నాయకులు మాత్రం ఈ విషయాన్ని ఆదిలోనే పసిగట్టారు. ఇదో నాటకం.. బూటకం... అంటూ ధ్వజమెత్తారు. వారి మాటలే నిజమయ్యాయి. అనుకున్నట్టుగానే జరిగింది. పార్టీలోని నేతలు, మేధావులు, విద్యావంతులు, చివరకు.. అమెరికాలోని ప్రవాస తెలంగాణ ప్రజానీకం సైతం తనకు ఫోన్లు చేసినట్టు చెప్పుకున్నారు. అలాగే తనను వ్యక్తిగతంగా కలసి చేసిన విజ్ఞప్తుల మేరకు, పార్టీ సర్వసభ్య సమావేశం జారీ చేసిన ఆదేశాలను శిరసావహిస్తూ రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్టు కేసీఆర్ ఆదివారం రాత్రి హడావుడిగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రకటించి, చేతులు దులుపుకున్నారు. ఇకపై అందరితోనూ చర్చించి, కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకు వెళ్తామని, ఎట్టి పరిస్థితిలోనూ దాన్ని మలినం కానివ్వబోనని కేసీఆర్ స్పష్టం చేశారు. సమస్యలు ఏవైనా ఉంటే పార్టీ వేదికల నుంచి దృష్టికి తీసుకురావాలన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరిమీదా పగ, కోపం, ద్వేషం లేవని తేల్చి చెప్పారు. అయితే, ఉన్నదంతా తెలంగాణా ప్రజలకు, ఆయనపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేతలకేనా అన్నది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న. కేసీఆర్ నాయకత్వాన్ని తమకు కలిగిన ఓటు ద్వారా తెలంగాణా ప్రజలు నిర్ద్వందంగా తోసిపుచ్చారన్నది జగమెరిగిన సత్యం. చివరకు తాను ఎంపీగా పోటీ చేసిన మహబూబ్‌నగర్ స్థానంలో గుడ్డిలో మెల్లగా బయటపడిన కేసీఆర్... ప్రజల మనోభావాలను పట్టించుకోరనే విషయం ఇక్కడ మరోమారు తేటతెల్లమైంది. ఎవరు ఎలా పోయినా నాకేంటి.. తనకు మాత్రం తాను, తన కుటుంబం, తన నాయకత్వమే ముఖ్యమని చాటి చెప్పారు. మొత్తం మీద కేసీఆర్ రాజీనామా చేయడం, ఉపసంహరించుకోవడం అన్నది ఒక నాటకమని మరోమారు తేటతెల్లమైంది. |
| |
| | |
| | | |
|
| | సంబంధిత సమాచారం కోసం శోధించండి. దీన్ని కూడా శోధించు: కేసీఆర్, తెరాస, రాజీనామా, నేతలు, రెబెల్స్, ప్రజలు, రాష్ట్రం, రాజకీయాలు, ఓటమి, అధ్యక్షుడు, kcr, trs, resign, leaders, rebals, people, state, politics, loss, president |
|
|
|
| |
|
|
|
|
|
|
|
| |
|  | |