ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి రాజకీయాలను ఆకళింపు చేసుకుంటున్నారు. "ఇంతింతై వటుడింతై" అన్న చందంగా రోజురోజుకూ రాటుదేలుతున్నారు. మాటల్లో చాతుర్యం చూపుతున్నారు. చాణక్య నీతిని ప్రదర్శిస్తున్నారు. మీడియా ప్రశ్నలకు తొట్రుపాటు లేకుండా జవాబిస్తున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై దృష్టి పెడుతున్నారు. మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణానికి కృషి చేస్తున్నారు. ఇందుకోసం పార్టీ నేతలను సంసిద్ధం చేస్తున్నారు. వివిధ కారణాల రీత్యా పార్టీని వీడే నేతల గురించి పట్టించుకోవడం లేదు. బుజ్జగింపులు అసలే లేవు. ఎవరు వెళ్లినా.. ప్రజారాజ్యం పార్టీ ముందుకు వెళ్ళి తీరుతుందని ఘంటాపథంగా చెపుతున్నారు. పార్టీని పటిష్టం చేయడమే తన భవిష్యత్ లక్ష్యంగా ప్రకటించారు. ఆ కోవలోనే ముందుకు సాగుతున్నారు. మొత్తం మీద.. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమి చిరులో బాగానే మార్పులు తెచ్చినట్టు కనిపిస్తోంది. ఓటరు తీర్పును హుందాగా స్వీకరించారు. ఇకపై ప్రజలకు మరింత చేరువలో ఉంటామని ప్రకటించారు. బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్రను పోషిస్తామన్నారు. అదేసమయంలో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతామని చెప్పి తన విజ్ఞతను చాటుకున్నారు. ఈ మార్పునకు ప్రధాన కారణం ఎన్నికల ఫలితాలే అని పలువురు అంటున్నారు. అలాగే, ప్రజారాజ్యం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు, వచ్చిన ఆరోపణలు చిరును ఆలోచింపజేశాయి. పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా ప్రశాంత వదనంతో ఉంటూ, తన లక్ష్యం కోసం అకుంఠిత దీక్షతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. | | ఎన్నికల్లో ఎదురైన ఓటమి చిరంజీవిని తట్టిలేపింది. సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. ఎవరు వెళ్లినా.. ఐ డోంట్ కేర్ అనే తరహాలో ఉన్నారు. భవిష్యత్ పీఆర్పీదే అన్న కోణంలో చిరు ప్రణాళికలు రచిస్తున్నారు. |
| |
ఎన్నికలకు ముందు మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి పార్టీని వీడారు. ఆయన్ను బుజ్జగించేందుకు స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగారు. అలాగే పరకాల ప్రభాకర్‌ను ఓదార్చేందుకు అల్లు అరవింద్‌ను రాయబారానికి పంపారు. ఈ ఇద్దరి విషయాల్లో వారికి చుక్కెదురైంది. అయినా.. ఎక్కడా నోరు జారలేదు. ఫలితాల అనంతరం పరకాల చేసిన విమర్శలపై చిరంజీవి స్వయంగా స్పందించారు. పరకాలపై నిప్పులు చెరిగారు. ఇంతవరకు ముగిసిన అధ్యాయంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన మరో కీలక నేత డాక్టర్ మిత్రా పార్టీకి గుడ్‌బై చెప్పారు. వ్యక్తిగత కారణాల రీత్యా తప్పుకుంటున్నట్టు వివరణ ఇచ్చారు. అయితే, ఒకానొక సందర్భంలో "మిత్రా లేనిదే ప్రజారాజ్యం పార్టీ లేదు" అన్న చిరంజీవి.. మిత్రాను ఆపేందుకు పెద్దగా చొరవ చూపించినట్టు కనిపించలేదు. ఇతరులతో రాయబారం నడిపించలేదు. పైపెచ్చు.. ఎవరు వెళ్లినా వెళ్ళవచ్చు. అది వారి వ్యక్తిగత నిర్ణయం. పీఆర్పీ మాత్రం ముందుకు వెళుతుందని కాస్త కఠువుగా అన్నారు. ఎందుకంటే.. స్పార్క్ సంస్థ కన్వీనర్‌గా మిత్రా వ్యవహిరిస్తున్నారు. ఆయనతో కలిసి పని చేసిన అనేక మంది పీఆర్పీ నేతలు పార్టీని వీడనున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. వీరిని ఉద్దేశించే.. చిరంజీవి నర్మగర్భంగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అంటే.. పార్టీని ఎవరు వీడినా... ఐ డోంట్ కేర్... అనే కోణంలో చిరు వ్యాఖ్యలు ఉన్నాయి. అంతేకాకుండా, తెలుగు చిత్రసీమలో "మెగాస్టార్" హోదాను కల్పించిన తన అభిమానులకే ఇకపై పెద్దపీట వేస్తానని ఆయన చెప్పకనే చెప్పారు. ఈ మేరకు పీఆర్పీ నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభిమానులకు పెద్దపీట వేయనున్నట్టు ఇప్పటికే చిరంజీవి ప్రకటించారు. అలాగే చిరంజీవి సైతం.. తాను నిర్వహిస్తున్న కొన్ని కీలక బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలకు అప్పగించే యోచనలో ఉన్నారు. ఇందులోభాగంగా.. పార్టీ అధ్యక్ష పీఠాన్ని కూడా మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌కు ఇచ్చే విషయంపై ఆయన ఓ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల తాను పార్టీ నిర్మాణం, పటిష్టతపై మరింత లోతుగా దృష్టి సారించవచ్చన్నది చిరు అభిమతంగా ఉంది. పైపెచ్చు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి హోదాలో కొనసాగే మరో యోచనా వుంది. అలాగే, టిక్కెట్ల పంపిణీలో తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొన్న అల్లు అరవింద్‌ను ఇకపై తెరవెనుక పాత్రకే పరిమితం చేయనున్నారు. అల్లుకు కోశాధికారి వంటి కీలక బాధ్యతలు అప్పగించి, సాధ్యమైనంత వరకు అంతర్గత వ్యవహారాల వరకే పరిమితం చేసేలా చిరు ప్రణాళికను రచిస్తున్నారు. మొత్తం మీద మరో రెండు నెలల్లో తొలి వార్షికోత్సవం జరుపుకోనున్న ప్రజారాజ్యం పార్టీ.. ప్రజలకు మరింతగా చేరువై భవిష్యత్‌లో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది. |