| | "ఆపరేషన్ ఆకర్ష్"తో ప్రతిపక్షాలు కుదేల్! | | | | | గురువారం, 25 జూన్ 2009( 19:27 IST ) | | PNR | | | | |
| | |
| ప్రపంచాన్ని.. దేశాన్ని స్వైన్ ఫ్లూ వ్యాధి వణికిస్తోంది. రాష్ట్ర రాజకీయ పార్టీలను మాత్రం "వైఎస్ ప్లూ" కలవర పెడుతోంది. 'విభజించు.. పాలించు' అనే నానుడిని అచరించడంలో మంచి దిట్టగా పేరొందిన వైఎస్.. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసేందుకు తన "మార్కు" రాజకీయాన్ని ఆచరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగిన పక్షంలో తమ పార్టీలు నామరూపాలు లేకుండా పోతాయని ప్రతిపక్ష నేతలు మధన పడుతున్నారు. అరకొర ఆధిక్యంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. ప్రతిపక్షాలను బలహీనపరచడం ద్వారా మనుగడ సాగించాలని వేసిన ఎత్తుగడ ప్రత్యర్థి పార్టీల నేతలను గడగడలాడిస్తోంది. రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కాంగ్రెస్ నేతగా పేరు గడించిన వైఎస్.. ముచ్చటగా మూడోసారి సీఎం కిరీటాన్ని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్ళ కాలంలో పార్టీని మరింత పటిష్టం చేయడం, అదేసమయంలో స్థానిక సంస్థల్లో తిరుగులేని విజయాలను సాధించడం వైఎస్ లక్ష్యాలుగా ఉన్నాయి. దీనికి అవసరమైన బలాలను సమీకరించడానికి ఆయన అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ వినియోగించుకునేందుకు వ్యూహాలను పన్నుతున్నారు. గతంలో పి.వి.నరసింహా రావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రదర్శించిన చాణక్య నీతిని ఇప్పుడు వైఎస్ తన చేతల్లో చూపేందుకు సిద్ధపడటంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. | | వైఎస్ మార్కు రాజకీయంతో రాష్ట్రంలో ప్రతిపక్షాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్ చేసిన "ఆపరేషన్ ఆకర్ష్" వ్యాఖ్యలు ఛోటా, బడా అసమ్మతి నేతలకు ప్రాణావాయువులా మారాయి. వీరంతా తమ మనుగడకు కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు. |
| |
ఇందులోభాగంగా.. తొలుత ప్రత్యేక వాదంతో రాజకీయ జీవితాన్ని సాగిస్తున్న తెలంగాణా రాష్ట్ర సమితిని టార్గెట్ చేశారు. వైఎస్ బాణానికి తెరాస కకావికలమైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పట్లో కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు తప్పుకున్నారు. పార్టీ ముక్కలైంది. తెరాసకు ధీటుగా టీవీఎస్ ఆవిర్భవించింది. దీని ప్రభావం భవిష్యత్‌లో తేలాల్సి వుంది. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీపై దృష్టి సారించారు. ఈ ఒక్క పార్టీనే కాకుండా.. ప్రజారాజ్యం, సీపీఎం, సీపీఐ, తెరాస, భాజపా వంటి పార్టీలను చేసుకుని రాజశేఖరుడు తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఇటీవలే జిల్లా వారీ సమీక్షలకు శ్రీకారం చుట్టిన వైఎస్.. ప్రతిపక్షాలకు చెందిన బలమైన, ప్రజాకర్షణ కలిగిన నేతలకు గాలం వేసేలా మాట్లాడారు. తమ పార్టీ నష్ట పోయిన ప్రాంతాలపై ఆయన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ప్రతిపక్షాలకు చెందిన నేతలు ఎవరొచ్చినా పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాలని మంత్రులకు, జిల్లా నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు అధికారానికి దూరమైన తెదేపా నేతలకు, ఆ పార్టీకి చెందిన మాజీ నాయకులు, ప్రజారాజ్యం నేతలకు "ప్రాణవాయువు"లా మారాయి. గత ఐదు సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్న తెదేపా నేతలు పలువురు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అలాగే, తెరాస, భాజపా, పీఆర్పీ పార్టీల తరపున ఎన్నికల్లో పోటీ చేసి తీవ్రంగా నష్టపోయిన ఛోటా, బడా రాజకీయ నేతలు కూడా సీఎం వ్యాఖ్యల పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, గత ఐదేళ్ళతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఖర్చుపెట్టిన మొత్తంలో పూర్తిగా కాకపోయినా, కాస్త అయినా తిరిగి సంపాదించుకునేందుకు వారు సిద్ధపడుతున్నారు. దీంతో అధికార పార్టీలో చేరడమో లేదా ఆ పార్టీ నేతలకు సన్నిహితంగా మెలుగుతూ తమ రాజకీయ మనుగడను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రభావం ఎక్కువగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, మరో కొత్త పార్టీ ప్రజారాజ్యంపై ఉంది. ప్రజారాజ్యం ప్రభావం ముగిసిన ఎన్నికల్లో తేలడంతో ఆ పార్టీకి చెందిన మాజీ తెదేపా నేతలంతా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే, తెదేపా అధినేత చంద్రబాబు వైఖరితో విసిగి వేసారిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు పలువురు కాంగ్రెస్ పంచకు వచ్చేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ ప్రభావం అపుడే తెదేపాపై పడింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. చంద్రబాబుపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ అండదండలు ఉండటం వల్లే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వస్తున్నాయి. తాజాగా మరో సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తన అసంతృప్తిని మీడియా ద్వారా వ్యక్తం చేశారు. అయితే, ఈయన బాబుపై విమర్శలు చేయకపోయినప్పటికీ, ప్రత్యేక తెలంగాణా వాదాన్ని వీడి, సమైఖ్య వాదానికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద రాజశేఖరుడు చేసిన "ఆపరేషన్ ఆకర్ష్" వ్యాఖ్యలు ప్రతిపక్షాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తమ పార్టీలకు చెందిన నేతలను కాపాడుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. ఏది ఏమైనా.. రెండో సారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్ గతం కంటే భిన్నంగా వ్యవహించడం ప్రతిపక్షాలకు మింగుడుపడని అంశంగా మారింది. |
| |
| | |
| | | |
|
| | సంబంధిత సమాచారం కోసం శోధించండి. దీన్ని కూడా శోధించు: వైఎస్, ప్రాంతీయం, రాష్ట్రం, రాజకీయం, తెదేపా, కాంగ్రెస్, తెరాస, ప్రరాపా, ముఖ్యమంత్రి, Ys, regional, state, politics, tdp, congress, trs, prp, chief minister, pcc |
|
|
|
| |
|
|
|
|
|
|
|
| |
|  | |