సమైక్యవాదంతో తెలుగుదేశం పార్టీలో తుఫాను సృష్టించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ శాంతించారు. అటు కాంగ్రెస్‌తో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం చెడటంతో పాలుపోని తలసాని.. తన రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మెత్తబడ్డారు. అదేసమయంలో అధినేత చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో ఆయనతో సమావేశమై జరిగిన పరిణామాలకు సంజాయిషీ ఇచ్చారు. ఇదిలావుండగా, సమైక్యవాదంపై పార్టీ వైఖరిని వెల్లడించాలని గట్టిగా డిమాండ్ చేసిన తలసానికి చెక్ పెట్టేందుకు బాబు వేగంగా పావులు కదిపారు. పార్టీ నుంచి బహిష్కరించిన మాజీ మంత్రి కృష్ణ యాదవ్‌ను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. తన సమక్షంలోనే కృష్ణ యాదవ్ పార్టీలో చేరేలా చేశారు. అదే సమయంలో తలసానిని బుజ్జిగించి సఫలీకృతులయ్యారు. దీంతో తలసాని మెట్టుదిగక తప్పలేదు. ' ఒక దెబ్బకు రెండు పిట్టలు' అన్న చందంగా చంద్రబాబు తన రాజకీయ చాణక్య నీతిని ప్రదర్శించారు. ఫలితంగా, తలసాని సమైక్యవాదంపై పార్టీలో పెద్దగా చర్చ లేకుండా చేయగలిగారు. అసలు.. తలసానికి మెత్తబడటానికి ప్రధాన కారణాలు ఏమిటి అనే దానిపై ఆరా తీస్తే.. పలు ఆసక్తికర అంశాలు తెలుస్తున్నాయి. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ మేయర్ పదవిపై కన్నేసిన తలసాని.. కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు వినికిడి. దీంతో తన మాతృసంస్థ తెదేపాలో రెండు రోజుల పాటు హైడ్రామా నడిపారు. పార్టీ అధినేతపై అసమ్మతి గళం వినిపించారు. సమైక్యాంధ్రపై పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో పార్టీని వీడుతానని సంకేతాలు పంపారు. కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే తలసాని ఇలా ధైర్యంగా చెప్పగలిగారని అటు కాంగ్రెస్, ఇటు తెదేపా నేతలు భావించారు. దీంతో మేల్కొన్న కాంగ్రెస్ నేతలు తలసానితో అధిష్టానం కుదుర్చుకున్న ఫార్ములాకు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా తలసాని ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇదే తలసానికి ఇబ్బందిగా మారింది. కానీ, తలసానికి పార్టీలోకి లాక్కొనేందుకు కాంగ్రెస్ బేరానికి దిగింది. ఎమ్మెల్సీతో పాటు.. కొన్ని కార్పొరేట్ స్థానాలను కేటాయించేందుకు కాంగ్రెస్ నేతలు ముందుకు వచ్చారు. గ్రేటర్ మేయర్ పదవిపై కన్నేసిన తలసానికి ఈ ప్రతిపాదన ఏమాత్రం రుచించలేదు. ఫలితంగా బేరం చెడింది. తలసాని మెత్తబడటానికి ఓ కారణంగా తెలుస్తోంది. ఇదే సమయంలో బాబు నుంచి తలసానికి పిలుపు వచ్చింది. ఎమ్మెల్సీతో పాటు.. పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ పదవిని ఇచ్చేందుకు బాబు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో తలసాని దిగొచ్చారు. అధినేతతో చర్చలు జరిపారు. తన ఆవేదనపై వివరణ ఇచ్చారు. ఇదిలావుండగా, గతంలో పార్టీ సస్పెండ్ చేసిన మాజీ మంత్రి, సీనియర్ నేత కృష్ణ యాదవ్‌ను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. జంట నగరాల్లో ప్రజాకర్షక నేతగా పేరున్న తలసానికి చెక్ పెట్టేందుకు కృష్ణయాదవ్‌ను పార్టీలోకి మళ్లీ తీసుకున్నట్టు ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. ఇద్దరు ఒకే కులానికి చెందిన వారు కావడం, కృష్ణ యాదవ్‌కు కూడా మంచి ఆదరణ ఉండటంతో బాబు అతనిని పార్టీలో చేర్చుకునేందుకు సమ్మతించారు. అటు కాంగ్రెస్‌తో బేరం చెడటం, ఇటు.. తనకు చెక్ పెట్టేందుకు కృష్ణ యాదవ్‌ను పార్టీలో చేర్చుకోవడంతో ఖంగుతిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అధిష్టానంతో రాజీ పడ్డారు. అయితే, సమైక్యవాదంపై తెదేపా నిర్ణయం తీసుకోని పక్షంలో తలసాని పార్టీలోనే కొనసాగుతారా లేదా ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతారా అనేది వేచి చూడాల్సిందే. |