భారతదేశం ముసలిదైపోతోందా...అవుననే అంటున్నారు పరిశోధకులు. ప్రస్తుత శతాబ్దంలో అంటే 2050వ సంవత్సరాంతానికి భారతదేశంలో ముసలివారి సంఖ్య ప్రస్తుతమున్న వారికన్నా నాలుగింతలు పెరిగిపోతుందంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ముసలివారి సంఖ్య మూడు రెట్లు పెరిగిపోతుంది. ఈమధ్యనే అమెరికాకు చెందిన జనాభా లెక్కల సేకరణ బ్యూరో(పీసీబీ) నిర్వహించిన సర్వేననుసరించి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత శతాబ్దంలో 2050వ సంవత్సరంనాటికి ముసలి వయసు కలిగిన వారి సంఖ్య దాదాపు మూడురెట్లు పెరుగనున్నట్లు తెలుస్తోంది. అందులో భారతదేశంలోని ముసలి వయసు కలిగిన వారి సంఖ్య నాలుగింతలు పెరిగిపోతుందని పీసీబీ వెల్లడించింది.
పీసీబీననుసరించి ప్రపంచవ్యాప్తంగా 65 సంవత్సరాలు అంతకు పైబడినవారి సంఖ్య దాదాపు 51.6 కోట్లుగా ఉంది. ఇదే 2050వ సంవత్సరాంతానికి 1.53 వందల కోట్లకు చేరుకుంటుందని ఆ సంస్థ తెలిపింది. అదే అమెరికాలో ముదుసలి వయసు కలిగినవారి సంఖ్య రెండింతలు అవుతుందని సంస్థ అంచనా వేసింది.
అదే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశాలుగా చైనా, భారతదేశాలు చరిత్ర సృష్టించాయి. కాని ఈ రెండు దేశాలలోనున్న జనాభాలో ముసలివారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. ఏదేమైనప్పటికీ సంఖ్యాపరంగా ముసలి వయసు కలిగిన వారి సంఖ్య మాత్రం ఈ రెండు దేశాలలో ఎక్కువగానే ఉందని ఆ సంస్థ తెలిపింది.
ఇదిలావుండగా చైనాలో ముదుసలి వయసు కలిగిన వారి సంఖ్య 10.9 కోట్లుండగా, భారతదేశంలో 6.2 కోట్లమంది ముసలివారున్నట్లు సంస్థ పేర్కొంది. కాగా 2050వ సంవత్సరాంతానికి చైనాలో ముసలి వారి సంఖ్య 35 కోట్లకు చేరుకుంటుంది, అదే భారతదేశంలో వయసుపైబడినవారి సంఖ్య 24 కోట్లకు చేరుకుంటుందని ఆ సంస్థ అంచనా వేసింది.
2009వ సంవత్సరంనుంచి 2050వ సంవత్సరాంతానికి ప్రపంచవ్యాప్తంగా 85 సంవత్సరాలు కలిగినవారు లేదా అంతకు పైబడిన వయసు కలవారి సంఖ్య నాలుగు కోట్లనుంచి 21.9 కోట్లకు చేరుకుంటుందని పీసీబీ అంచనా వేసింది.
ఇలా ఎందుకని సంస్థ నిర్వాహకులను ప్రశ్నిస్తే... సాధారణంగా మహిళలకన్నా పురుషుల వయసు ఎక్కువగా ఉంటుంది. వయసుపైబడిన జనాభాలో మహిళల సంఖ్య అత్యధికంగా నమోదైంది. అదే 85 సంవత్సరాలు లేదా అంతకు పైబడిన వయసుకలిగినవారి జనాభాలో మహిళల సంఖ్య 2/3వ వంతుగా ఉందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. |