ఎప్పుడూ ప్రేక్షకుల ఆలోచనలకు పదునుపెట్టే వ్యాఖ్యలను చేస్తూ సినీ పరిశ్రమలో నానుతూ ఉండే రామ్‌గోపాల్ వర్మ, మైఖేల్ జాక్సన్ మరణంపై ఉద్వేగానికి లోనై మైఖేల్ అంటే తనకు ద్వేషమని తన బ్లాగులో పేర్కొన్నారు. అయితే అది ఎలాంటి ద్వేషమో వర్మ తన బ్లాగులో ఇలా రాసుకున్నారు..." నాకు మైఖేల్ జాక్సన్ అంటే ద్వేషం. ఒక మనిషిలా మైఖేల్ చనిపోయినందుకు నాకు అతనిపై ద్వేషం కలుగుతోంది. జీవించేందుకు అందరిలానే శ్వాసించినందుకు నాకతనంటే ద్వేషం. కొందరి గుండెలు హఠాత్తుగా ఎలా ఆగిపోతాయో అలాంటి గుండెనే అతను కూడా కలిగి ఉండటంపట్ల ద్వేషం కలుగుతోందినిజం... నాకు మైఖేల్ అంటే మహా ద్వేషం. ఎందుకంటే... అతను ఓ అద్భుతమైన ఓ మెరుపు కల. అటువంటి మెరుపు కల అయిన జాక్సన్ ఓ సాధారణ మానవునిలా భువి నుంచి నిష్క్రమించడంపై ద్వేషం కలుగుతుంది." అని పేర్కొన్నాడు. వినూత్నమైన, విభిన్నమైన ఆలోచనలతో ప్రేక్షకుల బుర్రలకు పదునుపెట్టే వర్మ, తెలుగులో శివ చిత్రంతో తనేమిటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్‌లో "సత్య", "కంపెనీ", "సర్కార్", "సర్కార్ రాజ్" వంటి హిట్ చిత్రాలను ఎన్నింటినో అందించాడు. అయితే తన సినిమాల్లో ఏదో ఒక పాటలో మైఖేల్ మార్కు ఉండాలని కోరుకునేవాడు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నాడు. "నేను విజయవాడలో ఉండగా నా మిత్రుడు మైఖేల్ జాక్సన్ "థ్రిల్లర్" వీడియోను చూపించేందుకు వీడియో పార్లర్‌కు తీసుకువెళ్లాడు. స్టెప్పులు వేయడానికి బ్యాలన్స్ కోసం చూసే మన సినీ పరిశ్రమకు, అసాధారణ విలువలు కలిగి అడుగు అడుక్కీ, స్టెప్పు స్టెప్పుకీ ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించే హాలీవుడ్ పరిశ్రమకు మధ్య తేడా అప్పుడే గమనించాను. నిజంగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. చెపితే నవ్వుతారు. నోరు తెరుచుకుని మైఖేల్ స్టెప్పులను అలా చూస్తుండి పోయాను. పార్లల్ బయటకు వచ్చిన నేను, నిజం చెప్పొద్దూ... మా స్నేహితునితో చాలాసేపు వాదించా. ఆ డ్యాన్స్ చేసింది మనిషే కాదని. మనిషి రూపంలో ఉన్న ఏదో ఒక అద్భుతమైన ఆకారమని. అదే నమ్మకంతో చాన్నాళ్లు ఉన్నా కూడా. నాటి ఆ మెరుపు కలలను ఛేదించిన నిజాన్ని నేను 1996లో చూశాను. అదే ముంబయిలో జాక్సన్ పాప్ నృత్య ప్రదర్శన. నా విజయవాడ పార్లర్ వీడియో వండర్‌ఫుల్ మేన్‌ను నిజంగా కళ్లారా చూశాను. ఆ మహామహుడు చేస్తున్న మెరుపు నృత్యాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. నిజంగా ఆరోజు నేనెన్నటికీ మరిచిపోలేను. అతని డ్యాన్సు, గాత్రం... దానికి అనుగుణంగా సంగీతం, అన్నిటికీ మించి ఎటుబడితే అటు అవలీలగా మెలితిరిగే శరీరం... ఇలా అన్నీ చేరి నన్ను మంత్రముగ్ధుడ్ని చేశాయి. అప్పుడు నాకు నిజంగా అనిపించింది. మైఖేల్ సహజమైన మానవ స్వరూపి కాదని. మరో ప్రపంచం నుంచి మనకు వినోదాన్ని అందించడానికి వచ్చిన ఓ అద్భుతమైన శక్తి అని. ఈ భూలోక వాసులను ఆనందింపజేయడానికి భగవంతుడు సృష్టించిన ఓ అపురూపమైన కళాఖండమని. అటువంటి కళానిధి ఇలా అర్థాంతరంగా భూలోకాన్ని విడిచి వెళ్లడంపై... నిజంగా నాకు ద్వేషం కలుగుతోంది..." |