సమాజంలో ఇటీవల టీనేజ్ అమ్మాయిలకు ప్రేమోన్మాదుల బెడద ఎక్కువైపోయింది. నగరం, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ అమ్మాయిలను ప్రేమించమని వేధించే ఆకతాయిలు తయారవుతున్నారు. ఈ జాబితాలో సెలబ్రిటీలు సైతం ఉంటున్నారు. గత అర్థరాత్రి హర్షద్ అనే యువకుడు సానియాను వివాహమాడతానని ఆమె ఇంటి ముందు హడావుడి చేశాడు. పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అరెస్టు చేశారు. మరి సాధారణ అమ్మాయిల సంగతో.. మారుమూల పల్లెల్లో, పట్టణాల్లో ఉంటున్న అమ్మాయిలు మాత్రం ప్రేమోన్మాదుల భయంతో గజగజలాడుతున్నారు. ఏదో స్నేహపూర్వకంగా పలుకరిస్తే చాలు.. దానికి క్రమంగా ప్రేమ అనే పేరు పెట్టి తమను వివాహం చేసుకోవాలని కొందరు అబ్బాయిలు వేధిస్తున్నారని అమ్మాయిలు వాపోతున్నారు.అసలు ఈ పరిస్థితికి కారణం... నేటి జీవన శైలేనంటున్నారు నిపుణులు. దీనితోపాటు ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలలో సైతం అమ్మాయిలను వేధించి.. వెంటపడి... ఎలాగైనా తమదోవకు తెచ్చుకుని వశం చేసుకునే సన్నివేశాల చిత్రీకరణ ఎక్కువవుతోంది. ఇవి కూడా కొంతవరకూ కారణమవుతున్నాయంటున్నారు.ఇక నేటి ఆధునిక జీవన శైలిలోకి తొంగి చూస్తే... స్నేహం పేరుతో రాత్రి వేళల్లో పార్టీలకు వెళ్లడం నేటి మోడ్రన్ టీనేజర్స్‌కు అలవాటై పోయింది. వీరిని చూసిన పట్టణ, పల్లె వాసుల పిల్లలు ఆ జీవన విధానానికి అనుకరణ చేసి లేని హంగులను అరువు తెచ్చుకునే ప్రయత్నంలో పడుతున్నారు. పాతకాలపు సంప్రదాయాలకు "కట్" కొట్టి కొత్త సంప్రదాయాలకు విలువనిస్తున్నారు. ఆడామగా తేడా లేకుండా ఎప్పుడైనా... ఎక్కడికైనా మిత్రులతో కలసి వెళ్లేందుకు వెనుకాడటం లేదు. ఆ చొరవతో కొందరు అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయి వెంట పడటం మొదలెడుతున్నారు. అతని పరిచయం సదరు అమ్మాయికి ఇస్టం లేకపోయినా బలవంతపు స్నేహంకోసం ప్రయత్నం మొదలవుతుంది. చివరికిది ప్రేమోన్మాదంగా మారి అమ్మాయిలకు వేధింపు మొదలవుతుందంటున్నారు మానసిక నిపుణులు. దీనిని నిరోధించాలంటే తొలుత తల్లిదండ్రుల్లో మార్పు రావాలంటున్నారు. యుక్త వయస్సు చేరుకున్న అబ్బాయి- అమ్మాయిల "దోస్తీ" ఎలా సాగుతుందో ఓ కంట కనిపెట్టాలంటున్నారు. పక్కదారి పడుతున్నట్లు అనిపించినపుడు హెచ్చరిస్తూ... వాటివల్ల కలిగే నష్టాలను వివరించాలంటున్నారు. ముఖ్యంగా నేటి బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు చెప్పే మాట... తమకు సమయం లేదని. కానీ తమ పిల్లలకోసం సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉంది. లేకపోతే సమాజంలో ఇటువంటి పోకడలు మరింత పురివిప్పే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. |