రాష్ట్ర రాజధానిలోని దిల్‌సుఖ్ నగర్‌లోని ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థిని తేజశ్విని తన సూసైడ్ నోట్‌లో "నాకు ఈ లైఫ్ nachaledu" అని ఒకే ఒక్క లైను రాసిపెట్టింది. ఆమె గత కొద్ది రోజులుగా ముభావంగా ఉంటోందని సమాచారం.ఆమె మరణానికి అసలు కారణమేమిటన్నది ప్రక్కనపెడితే, చదువు తప్ప మరో ప్రపంచం లేని విధంగా నేటి విద్యార్థినీవిద్యార్థులను మహా ఒత్తిడికి గురిచేస్తున్నారు వారి పేరెంట్స్. పుస్తకాల్లో రాతలన్నిటినీ తమ బుర్రల్లోకి ఎక్కించుకునే యంత్రాలన్నట్లు విద్యార్థులను చూస్తున్నారు చదువులు చెప్పే గురువులు. ఇక కార్పొరేట్ యాజమాన్యాలైతే.. విద్యార్థులను ఓ పెట్టుబడిగా మాత్రమే పరిగణిస్తున్నారు. వారి బుర్రలకు పదునుపెట్టి నూటికి నూరు మార్కులు సాధించి తద్వారా కోట్లు గడించాలన్న యోచన తప్ప మరో ఆలోచన లేనేలేదు. ఇలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యం అందరూ కలిసి అభం శుభం ఎరుగని పిల్లలను మరమనుషులుగా మార్చేసి వారికి మనసనేదే లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఫలితంగానే పలుచోట్ల విద్యార్థినీవిద్యార్థులు అర్థంతరంగా... ఎటువంటి కారణం లేకుండా... తనువు చాలిస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో బామ్మా, నానమ్మల ఊళ్లకు వెళ్లి వేసవి శెలవుల్లో సంతోషంగా కాలం గడిపేవారు. తద్వారా వారికి మానసిక విశ్రాంతి దొరికేది. సమ్మర్ క్యాంపులు, సమ్మర్ షార్ట్ టర్మ్ కోచింగులతో బిజీగా గడిపే నేటితరం విద్యార్థులకు అసలు ఆ తీరిక ఎక్కడిది. నాటితరం పిల్లలు.. ఆనందం, సంతోషం, ఉల్లాసం... ఇలా అన్నీ సమపాళ్లలో ఆస్వాదించేవారు. నేటితరం పిల్లలకు చదువనే "తిప్పలు" తప్ప ఆస్వాదించడానికి సమయమే లేదు. ఎటుచూసినా కొండలా కనబడే పుస్తకాలు... వాటివెనుక బెత్తంతో కోపాన్ని ప్రకటిస్తూ నిలుచునుండే టీచరయ్యలు, టీచరమ్మలు. ఇక వారికి లోకంలో ఏం కనబడుతుంది? క్లాసులో సంతోషంగా నవ్వాలంటే భయం.. మనసులో ఉన్నది చెప్పాలంటే భయం... ఇవన్నీ కాదనీ తల్లిదండ్రులతో కాస్త మనసు విప్పి మాట్లాడదామంటే పట్టించుకోరాయే? వెరసి, ఈ లోకంలో తమ గోడు వినేవారెవరూ లేరనే తలంపులో విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. వీటన్నిటినీ గమనిస్తూనే, ఇలాంటి పద్ధతులు ఉండకూడదంటూనే, పిల్లలను చదువనే ఒత్తిడికి గురిచేయకూడదంటూనే, టీవీల్లో, పత్రికల్లో చర్చలు పెడుతూనే.. వాటిని గాలికొదిలేసి తాము "తథా ప్రజా" అంటున్నారు తల్లిదండ్రులు. ఎంతటి నరకపు క్షోభ అనుభవించకపోతే... చిరుప్రాయంలోనే జీవితంపై విరక్తి చెందుతారు పిల్లలు. పిల్లలపై బండలాపడి వారిని పిండి చేస్తున్న ఒత్తిడిని దూరం చేయాల్సిన అవసరం ప్రతి తల్లిదీ, తండ్రిదీను. తల్లిదండ్రులు పూనుకుంటే గురువులను దారికి తీసుకు రావడం తేలికే. పిల్లల చదువుతో వ్యాపారం చేస్తున్న నేటి "ఒత్తిడి" విద్యా విధానంపై తిరగబడి ఆహ్లాదకర విద్యకోసం యత్నించండి తల్లిదండ్రులూ.. చేస్తారు కదూ... |