జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » కుతకుతలాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్... చీలిక తప్పదేమో...?!! (YS Jagan Mohan Reddy | Chief Minister | K. Rosaiah | K. Kesava Rao | AP Politics,)
 
FILE
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అధిష్ఠానం మౌనరాగం వీడనంటోంది. దీంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ స్థాయికి మించిన వేడితో కుతకుతలాడుతోంది. జగన్‌కు సీఎం పదవి దక్కనీయకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అధిష్ఠానం వద్ద అడ్డుపుల్లలు వేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

సమయం వచ్చినప్పుడు వారి అసలు రూపం బయటపెడతామని చెపుతున్నారు. ఇదిలావుంటే... మొన్నటివరకూ కేవలం కేవీపీ రామచంద్రరావు చుట్టూ తిరిగిన కాంగ్రెస్ రాజకీయం.. తాజాగా కె. కేశరావు ఇంటివైపు మళ్లింది. ఆయన ఇంటివద్ద అర్థరాత్రి దాటేవరకూ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

రాష్ట్ర స్థాయిలో ఎన్ని చర్చలు జరుగుతున్నా... కేంద్ర స్థాయిలో మాత్రం పురోగతి కనిపించడం లేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఏ ఒక్క హామీ బయటకు రావడం లేదు. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే సీఎం ఉన్నారు కదా...? అటువంటప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటని అధిష్ఠానం రాష్ట్ర కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నట్లు సమాచారం. దీంతో ఎటూ పాలుపోని వైఎస్ జగన్ విధేయులు డీలా పడుతున్నారు.

ఏదేమైనా తమ యువ నాయకునికి సీఎం పదవి కట్టబెట్టేంత వరకూ విశ్రమించేది లేదన్న పట్టుదలతో వారు పావులు కదుపుతున్నారు. "గోతికాడ నక్కల్లా" ఎందరు ఎన్ని పొంచులు వేసినా... తాము వాటిని సమర్థంగా తిప్పికొట్టి అనుకున్నది సాధిస్తామంటున్నారు.

ఇదిలావుంటే...వైఎస్ జగన్‌కు ఇడుపులపాయలో ప్రజలు సంఘీభావం ప్రకటించారు. జగన్‌కోసం జనం స్వచ్చందంగా తరలి రావడాన్ని చూసైనా అధిష్ఠానం "ఊ.." అంటుందేమోనన్న ఆశతో జగన్ విధేయులున్నారు. మరి అధిష్ఠానం ఏం చెపుతుందన్నది "మహా" ఎన్నికలు పూర్తయ్యేవరకూ వేచి చూడాల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.