కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనడంలో సందేహంలేదు. ఆయన మృతితో ముఖ్యమంత్రి పదవిని ఎవరికి కట్టబెట్టాలనేదానిపై అధిష్టానం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. దీంతో వైఎస్ తనయుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి తన అనుయాయులతో సంప్రదింపులు జరిపి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం తెచ్చిపెట్టిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. ఆ ఘనతను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించకుండా తాత్సారం చేయడంతో జగన్ నిరాశ చెందినట్లు ఆయన అంతరంగీకులు తెలిపారు. దీంతో జగన్ కొత్త ప్రణాళికను రూపొందించుకుంటున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి పదవి జగన్‌కు అప్పగించకుండా ఉంటే, రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఆ పార్టీని నిలువునా చీల్చి కొత్తగా ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీతో జతకట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.
తమ ప్రియతమ నేత వైఎస్ఆర్ అహర్నిశలు శ్రమించి ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలోను కాంగ్రెస్ పార్టీకి అధికారం సంపాదించి పెట్టినా కూడా ఆయన సేవలకు తగిన గుర్తింపునివ్వకపోవడం శోచనీయమని వైఎస్ వర్గీయులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పైగా రోశయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించేందుకు అధిష్టానం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండటంతో వైఎస్ అనుయాయులు, జగన్ వర్గీయులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
దీంతో జగన్ తన మకాం ఇడుపుల పాయకు మార్చి అక్కడినుంచే తగిన వ్యూహాన్ని రచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రరాపా అధినేత సహకారంతో జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు పావులు కదుపుతున్నట్లు జగన్ వర్గీయులు తెలిపారు.
ఇదిలావుండగా జగన్ తమతో కలిసి వస్తే తాము మద్దతివ్వడానికి సుముఖంగానే ఉన్నట్లు ప్రరాపా అధినేత చిరంజీవి సైతం సానుకూలత వ్యక్తం చేసినట్లు అభిజ్ఞవర్గాల కథనం. ప్రస్తుతం ప్రరాపాకు అసెంబ్లీలో కేవలం 18 మంది ఎమ్మెల్యేలున్నారు. జగన్‌కు మద్దతిస్తే అధికార పగ్గాలు పట్టవచ్చని ఆ పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం 157 మంది ఎమ్మెల్లేల్లో దాదాపు 140 మంది జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తున్న విషయం విదితమే. దీనికిపైగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు సైతం నైతిక మద్దతును ఇస్తున్నారు.
రాష్ట్రంలో ప్రరాపా అధినేత చిరంజీవి మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు జగన్ సన్నిహితులు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయని, కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగన్‌కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టకుండా ఉండేందుకు తెదేపా తెరవెనుక రాజకీయాలు నెరపుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భనిష్యత్తులో జగన్ ప్రరాపా మద్దతుతో ముఖ్యమంత్రి అయితే తెదేపాకు, ఇతర ప్రధాన రాజకీయ పార్టీలకు భవిష్యత్తులో అధికారం అంధకారంగా మారనుందని పలు రాజకీయ పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం.